నగరమంతా ఇక మట్టి గణేశులే...

First Published Aug 18, 2017, 2:48 PM IST
Highlights
  • మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై అవగాహన
  • నిమజ్జనానికి ప్రత్యేక నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తోంది

 

తెలంగాణ ప్రభుత్వం పర్యవారణ రక్షణకు ఉద్యమం చేపట్టింది.  ఇందులో భాగంగానే వినాయక చవితి సందర్భంగా ప్రజల్లో మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా.. వినాయక నిమజ్జనానికి ప్రత్యేక నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తోంది. వినాయక చవితి సమయంలో గణేష్ ప్రతిమల నిమజ్జనం వలన హుసేన్ సాగర్ నీరు కలుషితతమౌతుంది. దీనిని  నివారించేందుకు చర్యలు చేపట్టింది. జీహెచ్ ఎంసీ పరిధిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మట్టి విగ్రహాలను ప్రజలకు పంచేందుకు సన్నాహాలు చేస్తోంది టీఆర్ ఎస్ ప్రభుత్వం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలనే సంకల్పంతో పనిచేస్తోంది.

ఇందులో భాగంగానే గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ మట్టి వినాయక ప్రతిమల ఆవశ్యకత గురించి శిల్పకళావేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ అధికారులు, హెచ్ఎండీఏ, పీసీబీ అధికారులు, పలువురు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మట్లాడుతూ..   ఈ ఏడాది వినాయకచవితికి తెలంగాణ ప్రభుత్వం రెండులక్షల మట్టి గణేశుని ప్రతిమలను నగరంలో పంచిపెట్టనున్నట్లు చెప్పారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టాల్లు ఏర్పాటు చేసి.. వినాయక విగ్రహాలను పంచిపెడతామని ఆయన చెప్పారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కూడా వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 15 అడుగులు కన్నా తక్కువ ఎత్తుగల వినాయక ప్రతిమలను హుసేన్ సాగర్ లో కాకుండా వేరే ప్రత్యేక ట్యాంకుల్లో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు. ఈ ఏడాది మరో 15  ట్యాంకులను అదనంగా ఏర్పాటుచేసినట్లు కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే 10 ట్యాంకులు ఉండగా.. అదనంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హుసేన్ సాగర్ లో కాలుష్యాన్ని తగ్గించేందుకే నీటి ట్యాంకులను ఏర్పాటు చేశామని.. వీటి నిర్మాణానికి రూ.20కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు.

click me!