వడగళ్లు, ఈదురుగాలులతో వర్షాలు: 13 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

First Published May 7, 2018, 12:04 PM IST
Highlights

చ్చే రెండు రోజుల్లో వడగళ్లు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 13 రాష్ట్రాలను, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరిక జారీ చేసింది.

న్యూఢిల్లీ: వచ్చే రెండు రోజుల్లో వడగళ్లు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 13 రాష్ట్రాలను, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరిక జారీ చేసింది. 

అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ పరిశోధన కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

జమ్మూకాశ్మీర్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్లు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, ఉత్తరాఖండ్ లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని సూచించింది.

పరిస్థితిని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని సూచించింది. వచ్చే 48 గంటల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. పశ్చిమ రాజస్థాన్ లో ఇసుక తుఫాను, ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.

రెండు రోజుల పాటు పాఠశాలలు మూసేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతవారం ఐదు రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుమలతో కూడిన వర్షాలకు 124 మంది మరణించగా, 300 వరకు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

click me!