లైంగిక, మానసిక వేధింపుల కేసు.. పోలీసుల విచారణకు హాజరైన యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్

Published : May 22, 2023, 03:33 PM IST
లైంగిక, మానసిక వేధింపుల కేసు.. పోలీసుల విచారణకు హాజరైన యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్

సారాంశం

అస్సాం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంకితా దత్తా దాఖలు చేసిన  లైంగిక, మానసిక వేధింపుల కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సోమవారం గౌహతిలో పోలీసుల ఎదుట హాజరయ్యారు. 

అస్సాం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంకితా దత్తా దాఖలు చేసిన  లైంగిక, మానసిక వేధింపుల కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సోమవారం గౌహతిలో పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ రోజు ఉదయం లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న బీవీ  శ్రీనివాస్.. ఉదయం 11 గంటలకు పన్‌బజార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. శ్రీనివాస్ వెంట ఆయన న్యాయవాది సహా అస్సాం కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

దాదాపు గంటన్నర సేపు పోలీస్ స్టేషన్‌లో గడిపిన అనంతరం నగరంలోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) కార్యాలయానికి బయల్దేరారు. ఒక గంట తర్వాత కార్యాలయం నుండి బయటకు వస్తుండగా అక్కడ వేచి ఉన్న విలేకరులతో.. ‘‘విషయం కోర్టులో ఉంది’’ అని చెప్పారు. ఇదిలా ఉండగా.. శ్రీనివాస్‌కు సంఘీభావం తెలిపేందుకు గౌహతికి రాకుండా వివిధ జిల్లాల్లోని తమ యువజన విభాగం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

ఇక, శ్రీనివాస్ తనపై గత ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, దూషించడంతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులకు తనపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరిస్తున్నాడని అంకితా దత్తా ఆరోపించింది. ఈ మేరకు ఏప్రిల్ 20న దిస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో నిందితుడు తనను శారీరకంగా వేధించారని, తనపై ఫిర్యాదు చేస్తే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత గౌహతి పోలీసుల ఐదుగురు సభ్యుల బృందం ఏప్రిల్ 23న బెంగళూరు వెళ్లి.. మే 2లోగా దిస్పూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని శ్రీనివాస్ నివాసంలో నోటీసును అతికించారు. అయితే ఇందుకు సంబంధించి శ్రీనివాస్ ముందస్తు బెయిల్ కోసం గౌహతి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ ఎదురుదెబ్బ తగలండంతో.. ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసులో అరెస్టు చేయకుండా మే 17న సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. విచారణకు సహకరించాలని.. ఈనెల 22న గౌహతిలో పోలీసుల ఎదుట హాజరుకావాలని శ్రీనివాస్‌ను ఆదేశించింది. జాతీయ మహిళా కమిషన్ చేపడుతున్న విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది.

ఇక, శ్రీనివాస్‌పై ఆరోపణలు  చేసిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ అంకితా దత్తాకు షోకాజ్ నోటీసు జారీ చేసి.. ఆరేళ్లపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆమెను బహిష్కరించింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం