
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లా మల్దేపూర్ ప్రాంతంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం గంగా నదిలో 40 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పది మందికి పైగా గల్లంతు అయ్యారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఆహారం దొరకక ఆకలితో పులి మృతి.. కార్బెట్ నేషనల్ పార్క్ లో ఘటన
మాల్దేపూర్ ఘాట్ వద్ద పలు కుటుంబాలు గుమిగూడి తమ పిల్లలకు 'ముండన్' కార్యక్రమం నిర్వహించేందుకు ఈ పడవలో అంత మంది ప్రయాణించినట్టు తెలుస్తోంది. అయితే పడవలో ఓవర్ లోడ్ కారణంగా అది మునిగిపోయిందని అర్థమవుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు బల్లియా అధికారులు ధృవీకరించారని వారణాసి జోన్ ఏడీజీ రామ్ కుమార్ తెలిపారు.
ఈ పడవ ప్రమాదంలో నీటిలో మునిగిపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని జిల్లా బల్దియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.