
ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh) యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) సర్కార్ పాత చట్టాల బూజు దులుపుతోంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 చట్టాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని యూపీ న్యాయ కమిషన్ చైర్మన్ ఎ.ఎన్. మిట్టల్ వెల్లడించారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు. 1,166 పాత చట్టాలతో అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించానని మిట్టల్ చెప్పారు. అందులో ఇప్పటిదాకా యోగి ప్రభుత్వం 800 చట్టాలను రద్దు చేసిందని ఆయన తెలిపారు. యోగి సర్కారుకు ముందు లా కమిషన్ లో కనీసం సిబ్బంది కూడా లేరన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాతే సిబ్బందిని తీసుకున్నామని మిట్టల్ తెలిపారు.
కమిషన్‌కు యోగి సర్కార్ నుంచి పూర్తి సహకారం అందుతోందని మిట్టల్ చెప్పారు. న్యాయ శాఖ ఉన్నా కూడా.. ముఖ్యమైన అంశాల గురించి కమిషన్ సలహాలు తీసుకుంటారని తెలిపారు. తామిచ్చిన 21 నివేదికల్లో 11 నివేదికలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఓ చట్టాన్ని తయారు చేయడానికి, అమలు చేయడానికి ముందు 20 నుంచి 25 మంది సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. అంతా మంచిదే అని చెప్పాకే చట్టాలను అమలు చేస్తారన్నారు.
కాగా, దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం నాడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల వివరాలను గమనిస్తే.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. 403 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో BJP 39.67 శాతం ఓట్లను సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ (SP) 47 సీట్లు, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (BSP) 19 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో.. ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియనుంది. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలపై ప్రభావం పడిందని స్పష్టంగా తెలుస్తోంది.