
వైయస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు ప్రేమ పెళ్లి తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన శుక్రవారం నాడు వైయస్సార్ జిల్లాలోని కమలాపురం సమీపంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు వైసిపి నాయకుడు జయశంకర్ రెడ్డి. కమలాపురం పట్టణంలోని గిడ్డంగి వీధిలో ఉంటున్నాడు. ఆయన కుమారుడు.. అదే వీధిలో ఉండే టిడిపి నాయకుడి బంధువుల కుమార్తె ప్రేమించుకున్నారు.
పల్లె రామ సుబ్బారెడ్డి టిడిపి నాయకుడు. ఆయన తమ్ముడు శేఖర్ రెడ్డి కుమార్తెతో జయశంకర్ రెడ్డి కుమారుడు ప్రేమలో పడ్డాడు. రాజకీయాలు, కుటుంబ సమస్యల నేపథ్యంలో తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని భావించి.. రెండు నెలల కిందట కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇండ్లలో తెలియడంతో కొంతకాలంగా కుటుంబాల మధ్య గొడవ నడుస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జయశంకర్ రెడ్డి తమ పొలానికి నీరు పెట్టడానికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ సమయంలో అతడి మీద దాడికి దిగారు. బండరాయితో జయశంకర్ రెడ్డి తల మీద విచక్షణ రహితంగా దాడి చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నిజమే.. జగన్‌కు అనుభవం లేదు : ఆదోనీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దీంతో జయశంకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందడంతో స్థానిక సీఐ సత్యబాబు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జయశంకర్ రెడ్డి హత్య.. ప్రేమ వివాహం కారణంగానే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లుగా తెలిపారు. అయితే అతని హత్యలో ఎవరెవరు ఉన్నారు అనేది పూర్తి విచారణలో తెలుస్తుంది అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ హత్య చేసిన వారు ఎంతటి వారైనా శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు.