
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి, ఇంకా కొనసాగిస్తోంది.
దీంతో తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక నేతలంతా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
ఈ ఉదయం కోల్‌కతాలోని టీఎంసీ భవన్‌లో ఆ పార్టీ నేతల సమక్షంలో ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. మమతపై జరిగిన దాడి కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని వింత పరిస్థితిని దేశం ఇప్పుడు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థల బలంపైనే ప్రజాస్వామ్య శక్తిసామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి.
కానీ నేడు దేశంలో న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు బలహీనపడుతున్నాయని సిన్హా ఆరోపించారు. వాజ్‌పేయీ హయంలోని బీజేపీ ప్రభుత్వం ఏకాభిప్రాయ విధానాలను విశ్వసించేదని ఆయన గుర్తుచేశారు.
అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘అణచివేత - విజేత’ ధోరణిని నమ్ముతోందని యశ్వంత్ సిన్హా ఆరోపించారు. అందుకే శిరోమణి అకాళీదళ్, బిజు జనతాదళ్ వంటి పార్టీలు ఎన్డీయేను వీడాయి అంటూ బీజేపీ కేంద్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
కాగా, 83ఏళ్ల యశ్వంత్ సిన్హా దేశంలోని సీనియర్ రాజకీయ వేత్తల్లో ఒకరు. సుదీర్ఘకాలం పాటు జనతాదళ్, బీజేపీలలో పనిచేశారు. బీజేపీ హయాంలో కేంద్ర ఆర్థిక , విదేశాంగ శాఖలకు మంత్రిగానూ వ్యవహరించారు.
అయితే సొంతపార్టీపైనే బహిరంగ విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన సిన్హా.. 2018లో బీజేపీని వీడారు. ఆ తర్వాత కూడా మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న ఆయన.. బెంగాల్ ఎన్నికల సమయంలో తృణమూల్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.