River Yamuna's water level swells to all-time high: ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి నదుల్లో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. యమునా నదిలో నీటిమట్టం ఆల్ టైమ్ రికార్డు స్థాయి 207.55 మీటర్లకు చేరుకోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అంతకు ముందు 1978లో 207.49 మీటర్ల ఎత్తుతో ఈ రికార్డు నమోదైంది. ఢిల్లీ సెక్రటేరియట్ లో కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారనీ, ఇందులో సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలోని యమునా నది నీటిమట్లం బుధవారం 207.55 మీటర్లకు పెరిగింది. 1978లో నెలకొల్పిన 207.49 మీటర్ల ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టి, రాజధానిలో వరదల భయాన్ని రేకెత్తించింది. నది మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా దేశ రాజధానిలోని వరద పీడిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు సెక్షన్ 144 CrPC విధించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
యమునా నది గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్ లో జరిగే ఈ సమావేశంలో సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు 203.14 మీటర్ల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటలకు 205.4కి ఎగిసి, ఊహించిన దానికంటే 18 గంటల ముందుగానే 205.33 మీటర్ల ప్రమాదకర మార్కును యమునా నటిమట్టం అధిగమించింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న నది నీరు ఇప్పుడు నగరంలోకి చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కాశ్మీరీ గేట్, రింగ్ రోడ్డు సమీపంలోని మఠ మార్కెట్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఉప్పొంగిన యమునా నది నీరు రింగురోడ్డులోకి ప్రవేశించడంతో ఆ నీరు మరింత ప్రవహించకుండా అధికారులు ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. ప్రజలను తరలించేందుకు భారీ యంత్రాలను మోహరించారు.