
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ సహా మరో ఇద్దరు న్యాయమూర్తులకు ఈ భద్రత కల్పిస్తామని వివరించారు. హిజాబ్‌పై తీర్పు వెలువరించిన ఈ ముగ్గురు (కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ, న్యాయమూర్తి క్రిష్ణ దీక్షిత్, న్యాయమూర్తి ఖాజీ ఎం జైబున్నీసా) న్యాయమూర్తులను ఓ వ్యక్తి బెదిరిస్తున్న వీడియో కలకలం రేపింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే సీఎం బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఆ వీడియోను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలపై వెంటనే అప్రమత్తం కావాలని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఇలాంటి జాతి వ్యతిరేక శక్తులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. మన దేశంలో న్యాయవ్యవస్థ సమర్థంగా ఉన్నది కాబట్టే శాంతి భద్రతలు స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముగ్గురు న్యాయమూర్తులు బెదిరిస్తున్న వీడియో కేసుకు సంబంధించి తమిళనాడులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటనలపై మౌనం దాల్చిన కుహనా లౌకికవాదులనూ తాను ప్రశ్నిస్తున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఇది లౌకికత్వం కాదని, మతోన్మాదం అని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అందరూ కలిసి ఏకమై.. ఖండించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
అడ్వకేట్ ఉమాపతి ఎస్ ఈ వీడియోపై కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. జార్ఖండ్ కోర్టు న్యాయమూర్తి వాకింగ్‌కు వెళ్లినప్పుడు హత్య చేసిన ఘటనను పేర్కొంటూ ఓ వ్యక్తి ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారని, ఆ వీడియో తనకు వాట్సాప్‌లో వచ్చిందని ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌పైనా బెదిరింపులకు పాల్పడ్డారని, జార్ఖండ్ న్యాయమూర్తి హత్యనూ ప్రస్తావించారని పేర్కొన్నారు. ఆ న్యాయమూర్తి అంతకు ముందు పని చేసిన అలహాబాద్ హైకోర్టు గురించి, న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ కుటుంబ సమేతంగా ఇటీవలే పర్యటించిన ఉడుపి మఠం గురించీ మాట్లాడారని తెలిపారు. చీఫ్ జస్టిస్‌ను ఆయన ఏకవచనంతో సంబోధించారని, దమ్ముంటే తనపై కేసు నమోదు చేయాలని సవాల్ విసిరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిజాబ్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును వల్గర్‌గా పేర్కొన్నారని వివరించారు. ఆ వీడియో బహుశా తమిళనాడులోని మదురైలో చిత్రీకరించి ఉండొచ్చని తెలిపారు.
కాగా, మరో అడ్వకేట్ సుధా కత్వా కూడా కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. తరగతి గదుల్లో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇస్లాంలో హిజాబ్ ధారణ తప్పనిసరి కాదని వివరించింది.
కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (supreme court)లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. హిజాబ్ అంశంపై హోలీ తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. విచారణ ఎప్పుడు చేపడుతామనేది కూడా హోలీ తర్వాతే లిస్టింగ్ చేస్తామని తెలిపింది.