
Delhi: దేశరాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆగ్నేయ ఢిల్లీలోని బారాపుల్లా ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు ఆటో-రిక్షాను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న13 ఏళ్ల బాలుడు, అతని తల్లి మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన కారును నడుపుతున్న వ్యక్తి కాలేజీ విద్యార్థి అనీ, అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఆటో నడుపుతున్న డ్రైవర్ వాకర్ ఆలం (25).. మాలవ్య నగర్ నివాసి. అందులో ప్రయాణిస్తున్న నలుగురు జనక్ జనధన్ భట్ (45), అతని భార్య గీతా భట్ (38), ఇద్దరు కుమారులు కార్తీక్ (18), కరణ్ (13) లు ఉన్నారు. వీరంతా కూడా వినోద్ నగర్ కు చెందిన వారు. ఈ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. కరణ్ మృతి చెందినట్లు ప్రకటించగా, వెంటిలేటర్ సపోర్టుపై ఉన్న గీత చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స అనంతరం జానక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అతని కొడుకులలో ఒకరు, ఆటో-రిక్షా డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారు జానక్ సోదరుడి ఇంట్లో హోలీ జరుపుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
“ఆటో రిక్షాను ఢీకొట్టిన తర్వాత, కారు టాక్సీని కూడా ఢీకొట్టింది. నిందితుడు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడిని నోయిడా సెక్టార్-78కి చెందిన ముకుల్ తోమర్ (21)గా పోలీసులు గుర్తించారు. అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ద్వారక నుండి నోయిడాకు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నాడని అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 279 (బహిరంగ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్), సెక్షన్ 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా గాయపరచడం) కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు చనిపోవడంతో ఐపీసీ సెక్షన్ 304ఏ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద మరో ఎఫ్ఐఆర్ నమోదుచేశామని పోలీసులు తెలిపారు.
జానక్ అన్నయ్య మహేశ్ మాట్లాడుతూ.. జానక్ గురువారం హోలీ జరుపుకునేందుకు మాళవీయ నగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. “మా తమ్ముడి కుటుంబం హోలీ వేడుకల కోసం మాలవీయ నగర్‌కు వచ్చింది. శుక్రవారం, నా పెద్ద మేనల్లుడు XII తరగతి చదువుతున్నందున.. అతను తన ట్యూషన్ తరగతులకు హాజరు కావాల్సి ఉన్నందున వారు రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి వెళ్తున్నారు. సాధారణంగా పండుగ సమయంలో నా దగ్గరే ఉంటారు’’ అని మహేశ్ అన్నారు. జానక్‌కి గీతతో 22 ఏళ్ల క్రితమే పెళ్లయిందని చెప్పాడు. ఆమె గృహిణి మరియు కరణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. జనక్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాకు చెందినవారు. సుమారు 20 సంవత్సరాలుగా ఢిల్లీలో నివసిస్తున్నారు.