
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోరం జరిగింది. కారు సరిగ్గా నడపాలని చెప్పడంతో ఓ యువకుడు మరో వ్యక్తిని కత్తితో పొడిచాడు. చంద్‌ఖేడా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి బాధితుడు దీపక్ ఠాకోర్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి దీపక్ తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. అయితే ఇదే సమయంలో కునాల్ షా అనే యువకుడి కారు బైక్ ను ఢీకొట్టింది. కొంత సమయం తరువాత కునాల్, ఆయన తల్లిదండ్రులు దీపక్ ఇంటికి వెళ్లారు. టూ వీలర్ వల్ల తన కారుకు నష్టం జరిగిందని, దీపక్ ను సరిగ్గా బండి నడపాలని అతడి తల్లిదండ్రులకు సూచించారు.
ఇలా దీపక్ తల్లిదండ్రులకు కునాల్, అతడి తల్లిదండ్రులు ప్రమాదం గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి దీపక్ చేరుకున్నాడు. వీరందరినీ అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. తప్పు కునాల్ దే అని, ఆయన కార్ సరిగ్గా డ్రైవ్ చేయాలని కోరాడు. దీంతో కునాల్ కు కోపం వచ్చింది. తీవ్రంగా రెచ్చిపోతూ దీపక్ ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో పాటు దుర్భాషలాడాడు. గొడవ ఇక్కడితో ఆగలేదు. వెంటనే తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని కునాల్, అతడి తల్లిదండ్రులకు దీపక్ సూచించాడు. దీంతో కోపంతో ఊగిపోతూ దీపక్ ఛాతీ కింద కత్తితో పొడిచాడు. వెంటనే అక్కడి నుంచి నిందితుడు తప్పించుకొని పారిపోయాడు.
ఈ దాడి అనంతరం వెంటనే దీపక్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అతడిని ఐసీయూలో చేర్చారు. ఈ ఘటనపై దీపక్ ఫిర్యాదు చేశాడు. దీంతో కునాల్ పై పోలీసులు సెక్షన్ 324 (ప్రమాదకరమైన ఆయుధాతో స్వచ్ఛందంగా గాయపరచడం), 294 (బి) (బహిరంగ ప్రదేశంలో అసభ్యకరమైన పదాలు ఉపయోగించడం), దీంతో పాటు సెక్షన్ 506 (2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. భార్య విడాకులు కోరిందని ఆమైపై కత్తితో దాడి చేశాడు ఓ భర్త. ఈ ఘటన రెండు రోజుల కిందట కర్ణాటకలో వెలుగులోకి వచ్చింద. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గడగ్ జిల్లా హుబ్బలి నివాసి మహ్మద్ ఎజాజ్ షిరూర్‌ని అపూర్వ పురాణిక్ తన పేరు మార్చుకుని మరీ వివాహం చేసుకుంది. అయితే అతనికి ఇంతకుముందు వివాహమై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ ఈ విషయం ఆమెకు తెలియకపోవడంతో అతడిని పెళ్లి చేసుకుంది. ఆమెతో తాను చదువుకుంటున్నానని.. పార్ట్ టైం ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నానని చెప్పి నమ్మించాడు. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. కొన్ని రోజుల తరువాత భర్త చేసిన మోసం ఆమె తెలుసుకుంది. దీంతో అతడి కలిసి జీవించకూడదని నిర్ణయించుకొని విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
భార్య విడాకులు కోరడంతో ఆమెపై భర్త కక్షపెంచుకున్నాడు. ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అపూర్వ కదలికలపై నిఘా పెట్టాడు. ఈ సమయంలోనే ఆమె స్కూటీ నేర్చుకుంటూ కనిపించింది. మంచి సమయం దొరికిందని భావించిన మహ్మద్ భార్యపై కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు. దీనిని గమనించి స్థానికులు పరిగెత్తుకుంటూ రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్టు చేశారు.