బిచ్చగాడేంటి.. కోట్ల ఆస్తులేంటి అని తికమక అవుతున్నారా? కానీ మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి భిక్షటన చేస్తూ ఏకంగా కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడు. అందుకే ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు అయ్యాడు. ఇతని ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసేవారు చాలా మందే ఉన్నారు. రోడ్లు, గుళ్ల దగ్గర భిక్షాటన చేస్తూ పొట్ట నుంపుకుంటారు. దయగల వారు వారికి తోచినంత ఇస్తుంటారు. అయితే భిక్షాటన చేస్తే ఎంత వస్తాయి..? మహా అయితే రోజుకు తినడానికి సరిపడా డబ్బులు వస్తాయేమో అంతే.. కానీ వీటితో ఆస్తులు కొనేంత అయితే రావు. చిరిగిన దుస్తులు, మాసిన జుట్టు పొట్టకోసం భిక్షటన చేసే వీరేం సంపాదిస్తారు అని తేలిగ్గా తీసిపారేస్తాం.. కానీ ఓ వ్యక్తి మాత్రం జస్ట్ భిక్షాటన చేస్తూనే కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. భిక్షాటనే సక్సెస్ ఫుల్ కెరీర్ గా మార్చుకున్నాడు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. ముంబైకి చెందిన భరత్ జైన్ ఒక్క భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచం మొత్తలో అత్యంత ధనవంతుడు.
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భరత్ జైన్ చదువును మానేసి భిక్షాటనను ఎంచుకున్నట్టు సమాచారం. ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇతడు బిచ్చగాడే కావొచ్చు.. కానీ కొడుకులకు మంచి భవిష్యత్ ను అందించాడు. వీళ్లిద్దరూ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. పలు నివేదికల ప్రకారం.. ఇతనికి నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తోంది.
భరత్ జైన్ కు ముంబైలో రూ.1.4 కోట్ల విలువైన రెండు ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా థానేలో రెండు దుకాణాలు కొన్నాడు. వీటి ద్వారా అతనికి నెలకు 30,000 రూపాయల రెంట్ ఆదాయం కూడా వస్తుంది. భరత్ జైన్ ముంబైలోని ఆజాద్ మైదాన్ లేదా ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో భిక్షాటన చేస్తుంటాడు.
భిక్షాటన చేసి కోట్లు కూడబెట్టినా.. జైన్ మాత్రం వీధుల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. ఇతరుల దయ వల్ల జైన్ రోజుకు 2,000 నుంచి 2,500 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. అదికూడా 10 నుంచి 12 గంటల్లో. కానీ చాలా మంది ఎన్ని గంటలు ఎక్కువ పనిచేసినా కొన్ని వందల రూపాయలు సంపాదించడం కూడా కష్టమే.
జైన్ ఫ్యామిలి పరేల్ లో ఒక పడకగది ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. పరేల్ కు చెందిన భరత్ జైన్ పిల్లలు కాన్వెంట్ స్కూల్ కు వెళ్లారు. భరత్ జైన్ కుటుంబ సభ్యులు స్టేషనరీ షాపు నడుపుతున్నారు. కానీ అతను మాత్రం భిక్షాటనే చేస్తున్నాడు.