
న్యూఢిల్లీ: నేడు ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సింహాల పరిరక్షణ, రక్షణ గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 10న జరుపుకుంటారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రపంచ సింహాల దినోత్సవం (World Lion Day) సందర్భంగా సింహాల ఆవాసాలను రక్షించేందుకు కృషి చేస్తున్న వారందరి అంకితభావాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆసియాటిక్ సింహాలకు నిలయంగా ఉన్నందుకు భారతదేశం గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.
‘‘ప్రపంచ సింహల దినోత్సవం.. వాటి శక్తి, గాంభీర్యంతో మన హృదయాలను దోచుకునే గంభీరమైన సింహాలను జరుపుకునే సందర్భం. భారతదేశం ఆసియాటిక్ సింహానికి నిలయంగా ఉన్నందుకు గర్విస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోంది. సింహాల ఆవాసాలను కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. మనం వాటిని రక్షిస్తూ, సంరక్షిస్తూనే, అవి రాబోయే తరాలకు అందుబాటులో ఉండేలా చూడాలి. అవి అభివృద్ధి చెందుతూనే ఉండాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.