
ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. నర్మదాలోని దేడియాపడా తాలూకాలో బుధవారం జరిగిన అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో గుజరాత్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల సందర్భంగా అక్కడి గిరిజనులు ఇచ్చిన నాటు సారాను తీర్థం అనుకొని మంత్రి తాగేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని భూమాతకు నాటు సారాతో అభిషేకం చేసే సంప్రదాయం ఏళ్ల తరబడి గుజరాత్ లో జరుగుతోంది. ఎప్పటిలాగే ఆ కార్యక్రమాన్ని దేడియాపడాలోని ఆదర్శ విద్యార్థి పాఠశాలలో అధికారికంగా నిర్వహించారు. దీనికి మంత్రి రాఘవ్ జీ పటేల్ హాజరయ్యారు. ఆయన వెంట బీజేపీ నాయకులు కూడా వచ్చారు. ఈ క్రమంలో అక్కడి గిరిజన పూజారి సావతు వాసవ కొన్ని అడవి ఆకులు, బియ్యం గింజలు, కొబ్బరికాయలు, నాటుసారాతో నిండిన ఆకుపచ్చ గాజు సీసాను తీసుకువచ్చి భూమికి సమర్పించాడు.
అనంతరం నాటు సారాను తీసుకొని అక్కడున్న నాయకులు, మంత్రికి ఓ ఆకులో పోశారు. వాస్తవానికి దానిని వీరంతా దేవుడికి సమర్పించాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలియని మంత్రి తనకు ఆకులో పోసిన నాటు సారాను తీర్థం అనుకొని వెంటనే తాగేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు అక్కడి నాయకులు ప్రయత్నించారు. కానీ ఆలోపే క్షణాల్లో మంత్రి దానిని సేవించారు. వెంటనే అక్కడున్న నాయకులు దానిని తాగకూడదని, దేవుడికి సమర్పించాలని చెప్పి, మంత్రి ఆకును కిందకి దించగానే నవ్వుకున్నారు. ఈ విషయం తనకు ముందే చెబితే బాగుండేదని రాఘవ్ జీ పటేల్ అన్నారు.
తరువాత తన తప్పును గ్రహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తనకు గిరిజన సంప్రదాయాల గురించి పెద్దగా తెలియదన్నారు. ఇక్కడి ఆచార వ్యవహారాలపై అవగాహన లేదని, తాను మొదటి సారిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. తనకు ఆకులో నాటు సారా పోస్తే, దానిని తీర్థంగా భావించి తాగేశానని అన్నారు. దాదాపు అన్ని ఆచారాల్లో తీర్థం పోస్తే, దానిని తాగాల్సి ఉంటుందని, ఇది కూడా అలాంటిదే అని భావించి తాగానని చెప్పారు. అయితే మంత్రి నాటు సాటు సారా తాగే సమయంలో పలువురు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.