
PM Modi Addresses Indian Diaspora In Greece: ఏథెన్స్ కన్జర్వేటరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. చంద్రుడిపై తిరంగాను ఎగురవేయడం ద్వారా దేశం తన సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసిందని అన్నారు. 'ఇది శివుని శ్రావణ మాసం. ఈ పవిత్ర మాసంలో దేశం సరికొత్త ఘనత సాధించింది. దక్షిణ ధ్రువం (చంద్రుడి) వద్ద డార్క్ జోన్ లో దిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై తన జెండాను ఎగురవేయడం ద్వారా భారత్ తన జెండా పవర్ ను యావత్ ప్రపంచానికి మరోసారి పరిచయం చేసిందని అన్నారు. భారత సామర్థ్యాల గురించి ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలుసునని అన్నారు.
అలాగే, భారతదేశం ఒక కొత్త మైలురాయిని సాధించిందనీ, చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా నిలిచిందని అన్నారు. "చంద్రుడిపై తిరంగాను ఎగురవేయడం ద్వారా భారతదేశ సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేశాం. ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం అభినందన సందేశాలతో నిండిపోయింది. సాధించిన విజయం ఇంత పెద్దదైతే, దాని సంబరం కూడా కొనసాగుతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, భారతదేశం మీ హృదయంలో కొట్టుకుంటుందని మీ ముఖాలు చెబుతున్నాయి. చంద్రయాన్-3 ఘనవిజయం సాధించినందుకు మరోసారి అభినందనలు" అంటూ పేర్కొన్నారు.
పంజాబీ జానపద నృత్యం భాంగ్రాతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి యువ భారతీయ కమ్యూనిటీ సభ్యులు పలు కార్యక్రమాలు ప్రదర్శించారు. ఇందులో వందలాది మంది భారతీయ ప్రవాస సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోడీ భారత కమ్యూనిటీ సభ్యులతో కలిసి భారత జాతీయ గీతాన్ని ఆలపించగా ప్రవాస భారతీయులు వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. జోహన్నెస్ బర్గ్ లో బ్రిక్స్ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ ఏథెన్స్ చేరుకున్నారు. ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్ స్వాగతం పలికారు. ఏథెన్స్ లోని హోటల్ కు చేరుకున్న ఆయనకు హోటల్ వెలుపల గుమిగూడిన ప్రవాస భారతీయులు 'భారత్ మాతాకీ జై, మోడీ మోదీ' నినాదాలతో ఘనస్వాగతం పలికారు.
కాగా, గత 40 ఏళ్లలో గ్రీస్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీనే కావడం విశేషం. చివరిసారిగా 1983లో ఇందిరాగాంధీ గ్రీస్ లో పర్యటించారు. 2019లో గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిట్సోటాకిస్ ఢిల్లీని సందర్శించారు. 2019 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ తో న్యూయార్క్ లో సమావేశమయ్యారు. సముద్ర రవాణా, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు-ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాలలో సహకారం ఫలితంగా భారతదేశం-గ్రీస్ నాగరిక సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో బలపడ్డాయి.