
న్యూఢిల్లీ: ఓ మహిళ తన లోదుస్తులను ఉతికి ఇంటి వెలుపల ఎండుకు ఆరబెట్టేది. కానీ, అనూహ్యంగా అవి కనిపించకుండా పోయేవి. గత ఎనిమిది నెలలుగా ఆమె లోదుస్తులు కనిపించకుండా పోతున్నది. ఆమె మనసు శంకించింది. ఎవరో కావాలనే తన లోదుస్తులను దొంగిలిస్తున్నారనే అనుమానం తనకు వచ్చింది. అంతే, ఆమె తాను తన లోదుస్తులను ఆరబెడుతున్న స్థలం కవర్ అయ్యేలా సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశారు. అప్పుడే ఆమెకు ఊహించని వాస్తవం తెలియవచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.
ఆ సీక్రెట్ కెమెరాలను పరిశీలిస్తుండగా తన లోదుస్తులను దొంగిలించడానికి ఒక వ్యక్తి వచ్చినట్టు తెలిసింది. పరిశీలించి చూడగా.. ఆ వ్యక్త తన పొరుగింటిలో నివసించే 31 ఏళ్ల వ్యక్తేనని ఆమె ధ్రువీకరించుకుని ఖంగుతిన్నది.
వెంటనే అతడిని ఆపే ప్రయత్నం చేస్తూ కేకలు వేసింది. అతను వెంటనే ఆమెపై దాడి చేశాడు. ఇష్టారీతిన ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇంతలో అరుపులు ఎక్కువ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు చేతిలో కర్రలు, ఇనుప రాడ్‌లను పట్టుకుని స్పాట్‌కు వచ్చారు. ఇంతలో అతని వైపునా ఇంకొందరు అక్కడికి చేరుకున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Also Read: జాతీయ రాజకీయాల్లో ‘జై కిసాన్, జై జవాన్’ నినాదం కేసీఆర్‌ను గట్టెక్కిస్తుందా?
ఈ ఘర్షణలో పది మంది గాయపడ్డారని ఇన్‌స్పెక్టర్ పీఎన్ జింజాడియా తెలిపారు. మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. హింసను ప్రేరేపించి గాయాలకు కారకులయ్యారని మహిళకు సంబంధించిన బంధువులపై కేసు ఫైల్ చేశామని ఆయన వివరించారు. అలాగే.. మహిళను లైంగికంగా వేధించడం, దాడి చేయడం, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలపై నిందితుడిపైనా కేసు నమోదైందని ఇన్‌స్పెక్టర్ పీఎన్ జింజాడియా చెప్పారు.