ముంబై ఆరె కాలనీలో చిరుత కలకలం.. మహిళ మీద దాడి...

By SumaBala BukkaFirst Published Nov 12, 2022, 1:23 PM IST
Highlights

ముంబై ఆరె కాలనీలో ఓ చిరుత మహిళ మీద దాడి చేసింది. ఈ దాడిలో ఆమె మెడ, వీపుపై గాయాలయ్యాయి. అయితే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. 

ముంబై : ముంబైలోని సబర్బన్ గోరేగావ్‌లోని ఆరే కాలనీలో చిరుతపులి హల్ చల్ చేసింది. ఓ 34 ఏళ్ల మహిళ మీద దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు వారు తెలిపారు.

"ఆరే కాలనీకి చెందిన సంగీత గురవ్, తన పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ఆ ప్రాంతంలో చిరుతపులిని గుర్తించింది. వెంటనే భయాందోళనలకు గురై.. తనను తాను రక్షించుకోవడానికి అక్కడినుంచి పరిగెత్తడం ప్రారంభించింది. కానీ పరిగెత్తలేక కిందపడిపోయింది. ఆమెను చూసిన చిరుతపులి.. ఆమె వెంట పడింది.. ఆమె కిందపడడంతో చిరుతపులి ఆమె మీదికి దూకింది" అని పోలీసు అధికారి తెలిపారు.

వేలంలో స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు.. ఎంత పలుకుతున్నాయంటే...

చిరుత దాడిలో మహిళ మెడపై, వీపుపై గాయాలయ్యాయని, ఆ తర్వాత పులి అడవిలోకి కనిపించకుండా పారిపోయిందని తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మహిళను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని, చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని తెలిపారు.

ఆరే కాలనీని ముంబై 'గ్రీన్ లంగ్' అని పిలుస్తారు. చిరుతపులులే కాకుండా, అనేక రకాలైన వృక్షాలు, జంతువులు ​​ఆరే అడవిలో కనిపిస్తాయి, ఇది  గోరేగావ్ సబర్బన్‌లో 1,800 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కి ఆనుకొని ఉంది.

click me!