
మధ్యప్రదేశ్ : ‘ది కేరళ స్టోరీ’ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా వాటన్నింటినీ దాటుకుని ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత కూడా సినిమాను బ్యాన్ చేయడం, థియేటర్లలో ప్రదర్శన జరగకుండా నిషేధం వంటి కష్టాలు ఈ సినిమా చుట్టూ ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా సినిమా మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. దీనిమీద అనేక చర్చలు, విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరోఘటనతో ‘ది కేరళ స్టోరీ’ చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది. ప్రియుడు మీద ప్రియురాలు పోలీస్ కేసు పెట్టేంత వరకు ఈ గొడవ వెళ్ళింది. విచిత్రంగా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఓ మహిళ.. 23 ఏళ్ల వ్యక్తిపై పోలీస్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే వీరిద్దరూ ప్రేమికులని, ఇటీవలే ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసి వచ్చారని పోలీసులు తెలిపారు.
సినిమా చూశాక ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ మహిళలో చైతన్యం కట్టలు తెంచుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ప్రేమ పేరుతో తనను ట్రాప్ చేసి, అత్యాచారం చేశాడంటూ అతనిమీద కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితోనే కలిసి జీవిస్తున్నట్లుగా చెబుతున్న ఆ మహిళ.. తన బాయ్ ఫ్రెండ్ తనను మతం మారాలని మానసికంగా హింసిస్తున్నాడని.. ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతనిని అరెస్టు చేశారు.
ఆ మహిళ దీని గురించి మాట్లాడుతూ.. ఇటీవలే తామిద్దరం కలిసి ది కేరళ స్టోరీ సినిమా చూశామని చెప్పింది. ఆ సినిమా చూసిన తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అతని తన మీద దాడి చేసి పరారయ్యాడని చెబుతూ మే 19వ తేదీన పోలీసులను ఆశ్రయించింది. బాయ్ ఫ్రెండ్ మీద కేసు పెట్టింది. అయితే, సదరు బాయ్ ఫ్రెండ్ నిరుద్యోగి, 12వ తరగతి వరకు చదువుకున్నాడు.
కాగా, బాధితురాలైన మహిళ ఉన్నత విద్యావంతురాలు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడితో ఆమెకు నాలుగేళ్ల క్రితం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది వారిద్దరి మధ్య ప్రేమకు, ఆ తరువాతి క్రమంలో సహజీవనానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. కాగా, మహిళ చేసిన ఆరోపణలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాతే దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.