
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కాగా.. బళ్లారి జిల్లాలోని పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి పోలింగ్ బూత్ నెంబర్ 228లో మనీలా అనే గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఆమెకు అక్కడే నొప్పులు రావడంతో మనీలాను పోలింగ్ సిబ్బంది, స్థానిక మహిళలు పక్కగదిలోకి తీసుకెళ్లి ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగానే వున్నారు. అనంతరం వారిద్దరిని దగ్గరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
మరోవైపు.. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ షురూ అయింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బీజేపీ మరోసారి వరుసగా అధికారంలోకి రావాలని భావిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం రాష్ట్రాల రివాల్వింగ్ డోర్ ట్రెండ్ పై దృష్టి సారించింది. 61 సీట్లకు పైగా బలం ఉన్న జేడీఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గంలోని మాకోనహళ్లిలోని పోలింగ్ బూత్ నెంబర్ 165లో ఓ వధువు తన ఓటు వేసింది. అయితే ఓవైపు పెళ్లి వేడుక ఉన్నప్పటికీ.. బాధ్యతగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వధువుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.