
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. పట్టపగలే మహిళను రోడ్డు మీద వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. సౌత్ వెస్ట్ ఢిల్లీలో 24యేళ్ల మహిళను తన ఇద్దరు పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆరతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వెల్తుండగా ఆమెను ఓ వ్యక్తి వెండించడం ప్రారంభించాడు. దీంతో ఏం చేయాలో తోచక ఇద్దరు పిల్లలతో మహిళ రోడ్డు మీదనే పరిగెత్తింది.
దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఆ తరువాత అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘోర దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మహిలను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచారణలో నిందితుడు మృతురాలు ఇంతకుముందు ఇరుగుపొరుగు వారని తేలిందని, ఆమె ఇప్పుడు వేరే ఇంటికి నివాసం మార్చినట్లు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి, పట్టుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇదిలా ఉండగా, అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను అడ్డు తొలగించిన భార్య, ఆమెకు సహకరించిన బావ, మరో ఇద్దరు యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నాదెండ్లలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం పొనుపాడికి చెందిన నల్లబోతు నరేంద్ర తన సమీప బంధువు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని శ్రీవిద్యను వివాహం చేసుకున్నాడు. అతను పేరేచర్ల పరిశ్రమలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. వీరికి సంతానం లేదు. పెళ్లికి ముందు నుంచి తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో శ్రీవిద్యకు వివాహేతర సంబంధం ఉంది.
పెళ్లి అయ్యాక ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని.. భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నరసరావుపేట పెద్ద చెరువులో నివసించే అక్క ఇంటినుంచే కుట్రకు తెరలేచింది.2017 డిసెంబర్ 19న భర్తకు బావతో ఫోన్ చేయించి, నరసరావుపేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ కి రప్పించింది. గతంలో పరిచయం ఉన్న మిత్రులు, బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల కు చెందిన బాలరాజు, ఈపూరు మండలం ముప్పాళ్ళకి చెందిన పూజల చౌడయ్యతో కలిసి ఆ రోజు రాత్రి అంతా రెస్టారెంట్ లోనే గడిపారు. బాకీ వసూలుకు మార్కాపురం వెళుతున్నట్లుగా చెప్పి తోడుగా నరేంద్ర సాయం కోరారు.
అతనిని కారులో ఎక్కించుకొని వినుకొండ వైపు బయలుదేరారు. మధ్యలో మద్యంలో సైనేడ్ కలిపి, నరేంద్రతో సాగించగా.. కారులోనే చనిపోయాడు. తిరిగి మృతదేహాన్ని తీసుకొచ్చి సాతులూరు వద్ద పెదనందిపాడు బ్రాంచ్ కాలువ కట్ట మీద పడేసారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా పెట్టి వెళ్ళిపోయారు.