
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్ ధరించి 2వ పీయూసీ పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు స్టూడెంట్లను అధికారులు నిలవరించారు. పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. వీరిద్దరు గతంలో తరగతి గదుల్లోకి హిజాబ్‌ను అనుమతించాలంటూ కర్ణాటక హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేసిన స్టూడెంట్లే. అధికారులు అడ్డుచెప్పడంతో వారు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు.
హిజాబ్ విషయంలో కోర్టులో పిటిషన్ వేసిన అలియా అస్సాది, రేషమ్ లు పీయూసీ పరీక్ష రాసేందుకు హాల్ టికెట్లు అందుకున్నారు. శుక్రవారం పరీక్ష రాసేందుకు హిజాబ్‌లు ధరించి ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీకి వచ్చారు. తమను ఇలాగే పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలని అక్కడి ఇన్విజిలేటర్లను, కాలేజీ ప్రిన్సిపాల్ ను 45 నిమిషాల పాటు కోరారు. అయితే ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు తీర్పు, ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి మినహాయింపు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక వారు పరీక్ష రాయకుండానే సెంటర్ నుంచి సైలెంట్ గా వెనుదిరిగారు.
హిజాబ్ వివాదం విషయంలో గతంలోనే కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. దీని ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందరు స్టూడెంట్లూ డ్రెస్ కోడ్ ను కలిగి ఉండాలని చెప్పింది. అలాగే తరగతి గదులకు, పరీక్ష కేంద్రాలకు హిజాబ్ ధరించి రాకూడదని కోరింది. SSLC, PUC పరీక్షల నుంచి కూడా హిజాబ్‌ను నిషేధించింది. కాగా కర్ణాటకలో 2వ పీయూసీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి, దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఎన్‌రోల్ చేసుకున్నారు.
ఈ ఏడాది జనవరి 1న కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఈ హిజాబ్ వివాదం రాజుకుంది. ఆరుగురు ఓ వర్గానికి చెందిన బాలికలు హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యారు. దీనిని కాలేజీ మేనేజ్‌మెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం మొదలైంది. ముస్లిం బాలికల హిజాబ్ ధరించి రావడంతో కొంత మంది మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క్లాసులకు రావడం మొదలు పెట్టింది. దీంతో రెండు ఉడిపిలో వర్గాల మధ్య మొదలైన ఈ సమస్య రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఇది పెద్ద ఆందోళనకు దారి తీసింది.
అయితే ఫిబ్రవరి 9న ఉడిపికి చెందిన ముస్లిం బాలికలు కోర్టుకు వెళ్లారు. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించడానికి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్‌లతో కూడిన పూర్తి బెంచ్ ఏర్పాటు అయ్యింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం కేసును రోజూ విచారించింది. హిజాబ్ వివాదంపై 11 రోజుల పాటు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 15 వ తేదీన ఈ విషయంలో కోర్టు తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ అవసరం లేదని తేల్చి చెప్పింది. అందరూ డ్రెస్ కోడ్ ను పాటించాలని కోరింది.