
మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేను బ్లాక్ మెయిల్ చేసిన ఓ మహిళను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను 37వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. దీంతో కోర్టు ఆమెను ఏప్రిల్ 27వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఆమె నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 2.16 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు, ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం. ధనుంజయ్ ముండే 2004 సంవత్సరం నుంచి కరుణ శర్మ అనే మహిళతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆమెకు ఓ కుమారుడు, కుమర్తె ఉన్నారు. అయితే ఆయన 2019లో మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అయిన తరవాత వారి మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి వారు దూరంగానే ఉంటున్నారు.
దీంతో కరుణ శర్మ, ఆమె సోదరి రేణు శర్మ, సోదరుడు బ్రిజేష్ శర్మ ఆయన భార్య హేమ ప్రవర్తనర్తలో మార్పు వచ్చింది. సోషల్ మీడియాలో మంత్రిపై ఆరోపణలు చేస్తూ కరుణ శర్మ అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది. అయితే ఈ విషయంలో ముండే బాంబే హైకోర్టులో ఫిర్యా దు చేశారు. 2020 డిసెంబర్ లో కోర్టు మంత్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మీడియాలో మంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదని కరుణ శర్మను ఆదేశించారు. ఆ ఉత్తర్వులు ఇప్పటికీ అమలులో ఉన్నాయి.
అయితే ఆమె సోదరి రేణు శర్మ 2020 డిసెంబర్, 2021 జనవరిలో మంత్రిని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది. 2021 జనవరి 11వ తేదీన ఆమె ఒషివారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. అయితే ఆమె 11 రోజుల తర్వాత తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. కానీ ఆమె అప్పటి నుంచి మంత్రిని డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉంది. 2022 ఫిబ్రవరి, మార్చి నెలలో ఆమె మంత్రిని రూ.5 కోట్లు, ఆస్తి, ఫోన్ లు కొనుగోలు చేయాలని కోరింది. దీంతో ఆమెకు ముండే రూ. లక్షలు అందించారు. రూ. 1.42 లక్షల విలువైన మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. అయితే మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.