
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్దాహా గ్రామంలోని ఓ గుడిసెలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒక మహిళ, ఐదుగురు పిల్లల ఉన్నారు. బుధవారం అర్దరాత్రి ఈ ప్రమాదం జరిగినప్పుడు మృతులంతా నిద్రిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివరాలు.. బుధవారం అర్దరాత్రి సమయంలో గుడిసెలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అందులో సంగీతతో పాటు పిల్లలు అంకిత్ (10), లక్ష్మీనా (09), రీత (03) గీత (02), బాబు (01) ఉన్నారు.
అయితే గుడిసెలో పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పి లోపల చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే సంగీత, పిల్లలు మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి మృతదేహాలను బయటకు తీశారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఖుషీనగర్ పోలీసు సూపరింటెండెంట్ ధవల్ జైస్వాల్ తెలిపారు.అగ్నిప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఖుషీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ రంజన్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. ఇక, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.