
UP assembly election 2022: దేశంలో ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం శనివారమే షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో.. ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియనుంది. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. యూపీ (UP assembly election)లో తమదే విజయమంటే.. తమదే గెలపు అంటూ ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
త్వరలో జరిగే యూపీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించి.. అధికారం పీఠం దక్కించుకోవాలని బీజేపీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. యూపీలో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. 37 ఏండ్ల చరిత్రను తిరగరాయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికలను గమనిస్తే.. గత 37 సంవత్సరాల్లో వరుసగా రెండో సారి ఏ ఒక్కరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. గత 37 ఏళ్ల చరిత్రను మార్చడమే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందున్న సవాలు.
ఇదివరకు నారాయన్ దత్ తివారీ.. !
37 సంవత్సరాల క్రితం క్రితం కాంగ్రెస్‌కు చెందిన నారాయణ్ దత్ తివారీ వరుసగా రెండు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. నారాయణ్ దత్ తివారీ 3 ఆగస్టు 1984 నుండి 10 మార్చి 1985 వరకు మొదటి పర్యాయం సీఎంగా కొనసాగారు. అలాగే, 11 మార్చి 1985 నుండి 24 సెప్టెంబర్ 1985 వరకు వరుసగా రెండో సారి.. వరుసగా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే, 1985 తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1985 తర్వాత నుంచి నేటి వరకు వరుసగా రెండుసార్లు యూపీకి ఒక్కరే సీఎం కావడం జరగలేదు.
యూపీలో బీజేపీ మెరుగైన ప్రదర్శన !
యూపీలో 2013 నుంచి బీజేపీ బాగా పుంజుకుంది. గత రెండు లోక్‌సభ ఎన్నికలు 2014, 2019 ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అలాగే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇదివరకటి ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. యూపీలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందనే చెప్పాలి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 73 స్థానాలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 64 స్థానాల్లో బీజేపీ కూటమి గెలుపొందింది. ఇక 2017 విధానసభ ఎన్నికల్లో (UP assembly election) 403 స్థానాలకు గాను 325 స్థానాలను గెలుచుకుని బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. బీజేపీ సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
గత మూడు ఎన్నికల్లో మెజారిటీ ప్రభుత్వమే..!
గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా పూర్తి మెజారిటీతో ఏర్పాటవడం గమనార్హం. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి పార్టీ బీఎస్పీ మెజారిటీ సాధించగా, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత 2017 శాసనసభ ఎన్నికల్లో (UP assembly election) బీజేపీ అఖండ విజయం సాధించింది.ముఖ్యంగా 14 ఏండ్ల తర్వాత 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో 2003లో బీఎస్పీ, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఉంది. 2022 విధానసభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించి, యూపీలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, సీఎం యోగి మళ్లీ ముఖ్యమంత్రి అయితే, పార్టీలో ఆయన స్థాయి గణనీయంగా పెరగడం ఖాయం. చూడాలి మరి ముఖ్యమంత్రి యోగి 37 ఏండ్ల చరిత్రను తిరగరాస్తారో లేదో .. !