మధ్యప్రదేశ్‌లో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు.
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరుగుతున్నాయి. మరో రెండు రోజులైతే క్యాంపెయిన్ ముగిసిపోనుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు హామీలు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రజాకర్షక హామీని ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ వాసులను అయోధ్యలోని రామ మందిరానికి తీసుకెళ్లుతామని హామీ ఇచ్చారు. దఫాలుగా ఇక్కడి నుంచి ప్రజలు తీసుకెళ్లి రామ మందిరం దర్శనం చేయిస్తామని చెప్పారు.
సోమవారం విదిశలో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తరుచూ ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామ మందిరం నిర్మాణ తేదీ ఎప్పుడు అని అడిగేవారని అన్నారు. ఆ రాహుల్ గాంధీకి తాను ఇప్పుడు సమాధానం చెబుతున్నానని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు.
Also Read: కాంగ్రెస్ యాడ్స్‌పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు.. మరో యాడ్‌తో కాంగ్రెస్ కౌంటర్ (Video)
ఈ సందర్భంలో ఓ బీజేపీ నేత తాము అయోధ్య మందిర దర్శనం కోసం డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందా? అని ప్రశ్నించగా.. దీనికి అమిత్ షా సమాధానం ఇస్తూ ఈ హామీ ఇచ్చారు. అయోధ్య రామ మందిర దర్శనం కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి బీజేపీకి అధికారం కట్టబెడితే తామే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని తాము తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రకటించామని తెలిపారు.