మా అధికారులను వేధిస్తే బెంగాల్‌లోని సీబీఐ, ఈడీ అధికారులపై చర్యలు తీసుకుంటాం: మమత బెన‌ర్జీ

By Mahesh RajamoniFirst Published Aug 29, 2022, 11:25 PM IST
Highlights

కోల్‌కతా: "సీబీఐ, ఈడీ పనితీరు గురించి నాకు తెలుసు. ఈ ఏజెన్సీలు చాలా మంది మంచి వ్యక్తులను కలిగి ఉన్నాయి. వారు నిజాయితీగా పని చేస్తారు. అయితే అదే సమయంలో కొందరు కేంద్ర ఏజెన్సీ అధికారులు అవినీతికి పాల్పడినట్లు మా వద్ద కూడా రుజువులు ఉన్నాయ‌ని" బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. 
 

పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ: బ్యూరోక్రాట్లు, పోలీసు సర్వీస్ అధికారులను వేధించడం కేంద్ర ప్రభుత్వం ఆపకపోతే పశ్చిమ బెంగాల్‌లో నియమించబడిన సెంట్రల్ ఏజెన్సీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు.  భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పైన విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బొగ్గు స్మగ్లింగ్ స్కామ్‌పై కేంద్ర ఏజెన్సీ కొనసాగుతున్న విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులను పిలిపించి ప్రశ్నించింది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ పై వ్యాఖ్య‌లు చేశారు. 

అలాగే, "సీబీఐ, ఈడీ పనితీరు గురించి నాకు తెలుసు. ఈ ఏజెన్సీలు చాలా మంది మంచి వ్యక్తులను కలిగి ఉన్నాయి. వారు నిజాయితీగా పని చేస్తారు. అయితే అదే సమయంలో కొందరు కేంద్ర ఏజెన్సీ అధికారులు అవినీతికి పాల్పడినట్లు మా వద్ద కూడా రుజువులు ఉన్నాయ‌ని" మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు.  పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికారులను న్యూఢిల్లీలో వేధిస్తే, అటువంటి తప్పిదమైన కేంద్ర ఏజెన్సీ అధికారులపై కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టు ఇచ్చిన తదుపరి ఉత్తర్వుల నేపథ్యంలో ముఖ్యమంత్రి మ‌మ‌తా.. న్యాయ వ్యవస్థపై కూడా సూక్ష్మంగా విరుచుకుపడ్డారు. “న్యాయ వ్యవస్థ దేశ ప్రజల కోసం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. దేశంలోని న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఇంకేమీ అవసరం లేదు' అని ఆమె అన్నారు.

ఇదే స‌మయంలో మ‌మ‌తా బెన‌ర్జీ మీడియాపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. “మీడియా సంస్థలు సమాంతర మీడియా ట్రయల్స్ నడుపుతున్నాయి. అనేకం బీజేపీ తరపున పనిచేస్తున్నాయి. కాబట్టి, మీడియా సంస్థలు చెప్పే వాటిపై ఆధారపడవద్దని ప్రజలను కోరుతున్నాను” అని ఆమె అన్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. కాగా, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఎజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరుసగా ప్రతిపక్ష నాయకులు, బీజేపీయేతర ప్రభుత్వాల రాష్ట్ర నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఎత్తిచూపుతున్నాయి. 

ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిష్ణుపూర్ ఎంపీ అయిన సౌమిత్రా ఖాన్.. సీఎం మమతా బెనర్జీ మ్యారిటల్ స్టేటస్ పై ప్రశ్నలు వేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా కుమారి అనాలా? శ్రీమతి అనాలా?’ అని అడిగారు. బంకూరా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తూ.. అభిషేక్ బెనర్జీని కూడా టార్గెట్ చేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జనరల్  సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ జంతారా గ్యాంగ్‌తో టచ్‌లో ఉన్నాడని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలను ఎత్తుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలను నాశనం చేయాలని చూస్తే తాము హైకోర్టును ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

click me!