
లక్నో: ఓ ఇంట్లో కొందరు కలిసి నమాజ్ చేశారు. వ్యక్తిగత రూపంలోనూ ఒకరి ఇంట్లో నమాజ్ చేయడానికి వారు ముందస్తుగా అనుమతి తీసుకోలేదని పోలీసు కేసు నమోదైంది. వీరి నమాజ్ పై కొందరు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతరం వ్యక్తం చేశార. దీంతో పోలీసులు మొత్తం 26 మంది పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని అరెస్టు చేయడానికి గాలింపులు జరుపుతున్నట్టు పోలీసులు వివరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లా దూలేపూర్‌లో చోటుచేసుకుంది.
దూలేపూర్‌లో మసీదు లేదు. దీంతో ముస్లిం వర్గానికి చెందిన కొందరు ఒక చోట కలిసి నమాజ్ చేయాలని అనుకున్నారు. అందుకోసం వారిలో ఒకరి ఇంటిని ఎంచుకున్నారు. ఆ ఇంటికి వెళ్లి నమాజ్ చేశారు. ఇంటి లోపల అయినా సరే ఆ నమాజ్ చేయడాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు తప్పుపట్టారు. పొరుగు వారి నుంచి వచ్చిన అభ్యంతరాల ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఒక చోట గుమిగూడి నమాజ్ చదువుతూ వారిలో కొందరు విద్వేషాన్ని, శత్రుత్వాన్ని రేపుతున్నారని అభియోగాలు మోపారని
వివరించారు. స్థానికుడు చంద్ర పాల్ సింగ్ ఈ నెల 24వ తేదీన చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఇందులో 16 మంది పేర్లను పేర్కొన్నారు. మరో పది మందిని ఇంకా గుర్తించలేదు. వారంతా అదే గ్రామానికి చెందినవారని ఫిర్యాదు దారుడు తెలిపారు.
ఓ ఇంటి కాంపౌండ్ పెద్ద సంఖ్యలో ముస్లిం వర్గానికి చెందిన వారు గుమిగూడి నమాజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. అదే నమాజ్ కాకుండా ఒకరు 26 మంది బంధు మిత్రులతో కలిసి హోమం నిర్వహించి ఉంటే అందరూ తప్పకుండా అంగీకరించేవారేనని అన్నారు. ఎక్కువ మంది ఒక చోట గుమిగూడటం సమస్య కాదు ఇక్కడ.. నమాజ్ చదవడమే వారు ఎత్తిచూపుతున్న సమస్య అంటూ సీరియస్ అయ్యారు.
పోలీసులు నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమూహంలో పాల్గొన్న వారి కోసం గాలింపులు జరుగుతున్నట్టు జిల్లా పోలీసు ఇంచార్జీ సందీప్ కుమార్ మీనా తెలిపారు.