
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే ఆదివారం తన క్యాంపెయిన్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మీరు అధ్యక్ష పదవి పొందితే గాంధీ కుటుంబానికి రిమోట్‌గా ఉంటారా? అని విలేకరులు ప్రశ్నించారు. ఆ వాదనను తిరస్కరించారు. కానీ, వారి మద్దతు లేదా.. వారి సలహా తీసుకోవడానికి సిగ్గు పడను అని స్పష్టం చేశారు.
‘వారు మాట్లాడటానికి ఇంకేమీ లేనట్టు ఇవే చెబుతారు. అలాంటి ప్రచారంలో బీజేపీ మునిగితేలుతుంటే.. ఇతరులు ఆ ప్రవాహాన్ని అనుసరిస్తున్నారు. సోనియా గాంధీ 20 ఏళ్ల పార్టీ కోసం పని చేశారు. రాహుల్ గాంధీ కూడా అధ్యక్షుడిగా చేశారు. పార్టీ బలోపేతానికి, అభివృద్ధి చేయడానికి వాళ్లు కష్టపడ్డారు. వారికి దేశవ్యాప్తంగా అవగాహన ఉన్నది. పార్టీ గురించి సమగ్ర అవగాహన ఉన్నది. వారి నుంచి సలహా తీసుకోవడానికి వెనుకాడను. మంచి సలహాలు మీడియా ఇచ్చినా స్వీకరిస్తాను’ అని మల్లికార్జున్ ఖర్గే వివరించారు.
Also Read: యువత మద్దతు నాకే.. కానీ.. : గెలుపు ఓటములపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
‘తాము కొన్ని ఎన్నికలు ఓడిపోయినంత మాత్రానా గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు. వారు ఈ దేశం కోసం మంచి చేశారు. పార్టీ కోసం కూడా ఎంతో కృషి చేశారు. అందుకే కచ్చితంగా వారి నుంచి సలహా తీసుకుంటా’ అని చెప్పారు.
మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు కర్ణాటకలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఆయన పార్టీ అధ్యక్ష బరిలో శశిథరూర్‌తో పోటీ పడుతున్నారు.