గంజాయి సాగు చేస్తా.. అనుమతులు ఇవ్వండి: కలెక్టర్‌కు రైతు దరఖాస్తు

By telugu teamFirst Published Aug 26, 2021, 5:15 PM IST
Highlights

సాగు లాభదాయకంగా లేదని, పెట్టిన డబ్బులూ తిరిగి రావడం లేదని ఓ మహారాష్ట్ర రైతు ఆవేదన చెందారు. పంటకు మార్కెట్‌లో స్థిరమైన ధర లేదని, కానీ, గంజాయికి మంచి గిరాకీ ఉన్నదని, దాన్ని సాగు చేయడానికి అనుమతించాలని మహారాష్ట్ర రైతు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. అంతేకాదు, వచ్చే నెల 15లోపు అనుతులివ్వాలని, లేదంటే అనుమతులు వచ్చినట్టుగానే భావించే గంజాయి సాగు మొదలుపెడతానని అల్టీమేటం పెట్టారు.

పూణె: ఏ పంట పండించినా పెట్టిన పైసలు కూడా రావటం లేదు. లాభదాయకమైన పంట కనిపించడమే లేదు. ఏ పంటకూ స్థిరమైన ధర లేదు. కానీ, మార్కెట్‌లో గంజాయికి మంచి గిరాకీ ఉన్నదని మహారాష్ట్ర రైతు ఒకరు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అందుకే తన జీవనోపాధిగా గంజాయి సాగు చేయడానికి అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు పెట్టులకున్నారు.

సోలాపూర్‌లోని మోహోల్ తెహసిల్‌కు చెందిన రైతు అనిల్ పాటిల్ ఈ లేఖ రాశారు. సోలాపూర్ జిల్లా కలెక్టర్‌కు ఈ దరఖాస్తును బుధవారం పంపారు. ‘వ్యవసాయంలో పండించిన పంట ధర పలకడం లేదు. సాగు కష్టతరంగా మారింది. పెట్టిన పైసలూ పంట ద్వారా రావడం లేదు. పండించిన చెరుకు షుగర్ ఫ్యాక్టరీలకు అమ్మినప్పటికీ రావాల్సిన డబ్బులు బకాయిల రూపంలో పెండింగ్‌లోనే ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

కానీ, మార్కెట్‌లో గంజాయికి మంచి ధర ఉన్నదని లేఖలో అనిల్ పాటిల్ తెలిపారు. అందుకే తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో గంజాయి పండించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. సెప్టెంబర్ 15లోపు తనకు అనుమతులు ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టారు. ఇంతలోపు తనకు అనుమతి రాకుంటే వచ్చినట్టుగానే భావించి 16వ తేదీ నుంచి గంజాయి సాగు మొదలు పెడతానని అల్టిమేటం పెట్టారు. ఆ తర్వాత తనపై ఎవరైనా గంజాయి పెంచుతున్నారని నేరం మోపితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

చర్చనీయాంశంగా మారిన ఈ లేఖను కలెక్టర్ మోహోల్ పోలీసు స్టేషన్‌కు పంపారు. ఈ లేఖపై మోహోల్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ సైకర్ స్పందించారు. రైతు అప్లికేషన్ ఒక పబ్లిక్ స్టంట్ అని కొట్టిపారేశారు. అంతేకాదు, ఒకవేళ సదరు రైతు గంజాయి సాగు చేస్తే ఆయనపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

click me!