25న హైకమాండ్ కీలక నిర్ణయం.. నాయకత్వ మార్పుపై నోరువిప్పిన యడియూరప్ప

By Siva KodatiFirst Published Jul 22, 2021, 4:48 PM IST
Highlights

ఈ నెల 25న సీఎంగా తన భవితవ్యంపై పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు తనపై ప్రత్యేకమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయన్నారు

కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పార్టీ ఎమ్మెల్యేలకు యడియూరప్ప ఇస్తానన్న విందు కూడా వాయిదా పడటం, యడ్డీ ఢిల్లీ పర్యటన ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు నాయకత్వ మార్పు వార్తలపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ నెల 25న సీఎంగా తన భవితవ్యంపై పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని యడ్డీ స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు తనపై ప్రత్యేకమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయన్నారు. పార్టీలో 75 ఏళ్లు పైబడిన వారికి స్థానం కల్పించని విషయం అందరికీ తెలుసు.. కానీ నా పనితీరును ప్రశంసిస్తూ 78 ఏళ్ల వయసు పైబడినా అవకాశం కల్పించారంటూ యడియూరప్ప గుర్తుచేసుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాననన్నారు.  

Also Read:బీజేపీ ఎమ్మెల్యేలకు యడియూరప్ప డిన్నర్ వాయిదా.. కర్ణాటకలో ఏం జరుగుతోంది

ఈ నెల 25న హైకమాండ్‌ పెద్దలు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉన్నా ఆ తర్వాతి రోజు నుంచే పార్టీ బలోపేతం కోసం తన కార్యాచరణ మొదలవుతుందని సీఎం చెప్పారు. కర్ణాటకలో తమ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని యడియూరప్ప తెలిపారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేస్తానని ఆయన చెప్పారు.   
 

click me!