
భారత దేశానికి వ్యతిరేకంగా నిలిచేవారు ఎన్ కౌంటర్ లో అంతం అవుతారని ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన ప్రకటన చేశారు.
ఉర్దూ కవి మునావర్ రాణా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శుక్లా మీడియాతో మాట్లాడుతూ... ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా, ఎన్ కౌంటర్ లో మరణిస్తారన్నారు.
ఉర్దూ కవి మునావర్ రాణా ఇటీవల మాట్లాడుతూ మోగి ఆదిత్యనాథ్మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే, తాను రాష్ట్రాన్ని విడిచి వేరొక చోటుకు వెళ్లిపోవడం గురించి ఆలోచిస్తానని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పాల్గొనడం మీద కూడా ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పార్టీలు కేవలం మతపరంగా ఓటర్లను పోలరైజ్ చేయాలని కోరుకుంటాయన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి శుక్లా మీడియాతో మాట్లాడుతూ, మునావర్ రాణా ప్రముఖ కవి అని, 1947లో దేశ విభజన తరువాత మన దేశంలోనే ఉన్నవారిలో ఆయన ఒకరని, వీరు దేశంలో ఉంటూనే దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత దేశానికి వ్యతిరేకంగా నిలిచినవారు ఎన్ కౌంటర్ లో మరణిస్తారన్నారు.