
పెళ్లయిన తర్వాత భార్య ఖాళీగా కూర్చోకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్యా బిడ్డలకు భర్త అందించే జీవనభృతిలో కోత విధించడంపై దాఖలైన కేసులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె (భార్య) ఇప్పుడు ఎందుకు పని చేయలేకపోతుందో తెలపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.
ఈ పిటిషన్ ను జస్టిస్ రాజేంద్ర బాదామికర్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. ఈ కేసును విచారించిన కోర్టు వివాహానంతరం భార్య ఎందుకు పనిచేయలేకపోయిందో సరైన వివరణ లేదని పేర్కొంది. ‘‘పెళ్లికి ముందు భార్య ఉద్యోగం చేస్తూ సంపాదించేంది. ఆమె ఖాళీగా కూర్చోకూడదు. తన భర్త నుంచి మొత్తం మెయింటెనెన్స్ కోరరాదు. తన జీవనోపాధి కోసం కొన్ని ప్రయత్నాలు చేయడానికి ఆమె చట్టబద్ధంగా కట్టుబడి ఉంది. ఆమె తన భర్త నుండి సహాయక భరణాన్ని మాత్రమే కోరవచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది.
మేజిస్ట్రేట్ కోర్టు తనకు ఇచ్చిన భరణంలో కోత విధించడాన్ని సవాలు చేస్తూ భార్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. సెషన్స్ కోర్టు (అప్పిలేట్ కోర్టు) దాఖలు చేసిన ఉత్తర్వుల ప్రకారం.. భరణం రూ .10,000 నుండి రూ .5,000 కు, పరిహారాన్ని రూ .3 లక్షల నుండి రూ .2 లక్షలకు తగ్గించారు. అయితే ఆమెకు మంజూరు చేసిన పరిహారం సరిపోదని పిటిషనర్ వాదించారు. సరైన సాకు లేకుండా సెషన్స్ కోర్టు భరణాన్ని తగ్గించిందని ఆమె ఆరోపించారు.
కాగా.. అత్తగారితో, సోదరితో ఉండేందుకు భార్య సుముఖంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా.. తల్లి, సోదరి సంరక్షణ బాధ్యత భర్తపై ఉంటుందని కోర్టు పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.