
పంజాబ్ లో గత వారం రోజులుగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఖలిస్థాన్ అనుకూల బోధకుడు అమృతపాల్ సింగ్‌ను అదుపులో తీసుకునే క్రమంలో పలువురు సిక్కులను అరెస్టు చేశారు. అయితే.. అరెస్టులను అకల్ తఖ్త్ చీఫ్ జతేదార్ గియాని హర్‌ప్రీత్ సింగ్ వ్యతిరేకిస్తున్నారు. అరెస్టయిన అమాయక సిక్కులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసుల ముందు లొంగిపోవాలని , విచారణలో సహకరించాలని కోరిన రెండు రోజుల తర్వాత అకల్ తఖ్త్ తాత్కాలిక జతేదార్ గియాని హర్‌ప్రీత్ సింగ్ ప్రకటన వెల్లడించడం గమనార్హం.
అమృతపాల్ సింగ్ అరెస్టు ప్రక్రియ (పోలీసుల ఆపరేషన్) మార్చి 18న ప్రారంభమైనప్పటి నుండి, రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా అరెస్టయ్యారు. 24 గంటల్లో యువకులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భయాందోళన వాతావరణాన్ని అంతం చేయకపోతే.. సిక్కులపై విపరీతమైన చర్యలకు పాల్పడే భారత ప్రభుత్వం సృష్టించిన వాతావరణానికి వ్యతిరేకంగా దేశ విదేశాలలో దౌత్యపరంగా ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. అమృతపాల్‌కు చెందిన ఎనిమిది మంది సహాయకులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ)ని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
సిక్కులను కించపరిచే వార్తా ఛానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తఖ్త్ హెచ్చరించింది, అమాయకుల విడుదల కోసం హైకోర్టును కూడా ఆశ్రయించనున్నామని అకల్ తఖ్త్ నాయకుడు జతేదార్ గియాని హర్‌ప్రీత్ సింగ్ అన్నారు. లక్షల మంది 'హిందూ రాష్ట్రం' డిమాండ్ చేస్తున్నారు, వారిపై కూడా జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపాలని డిమాండ్ చేశారు. సిక్కు యువకులను విడుదల చేయకపోతే, దూకుడుగా వ్యవహరిస్తామని అన్నారు.
అమృతపాల్ సింగ్ పోలీసుల ముందుకు రావాలని అన్నాను. కానీ తన మాటలను వక్రీకరించారని గియానీ హర్‌ప్రీత్ సింగ్ ఆరోపించారు. అరెస్టు చేసిన అమాయకులకు మేం అండగా ఉన్నాం. వారికి ,వారి ద్విచక్రవాహనాలను, వాహనాలను 24 గంటల్లో విడుదల చేయాలని , నిషేధించబడిన లేదా నిలిపివేయబడిన ఏవైనా సోషల్ మీడియా ఖాతాలు , వెబ్ ఛానెల్‌లను పునరుద్ధరించాలని అకల్ తఖ్త్ చీఫ్ అన్నారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ వాహనాలను ధ్వంసం చేసిన అధికారులను కోర్టుకు తరలించాలని ఆయన అన్నారు. మమ్మల్ని ఉగ్రవాదులుగా పిలవడం మానేయండని అన్నారు.
ఇప్పటివరకూ అమృతపాల్ , అతని అనుచరులపై ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది ఫిబ్రవరి 23న అజ్నాలా పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను వేలాది మంది అమృతపాల్ సింగ్ మద్దతుదారులు ముట్టడించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సహాయకుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్‌ను విడిపించవలసి వచ్చింది. 1980ల వేర్పాటువాద నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే తర్వాత తనను తాను ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గా అమృతపాల్ ప్రకటించుకున్నారు. ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం అతి పెద్ద కుట్ర అని, అమృతపాల్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్ నుంచి యువకులను వేగంగా రాడికలైజ్ చేస్తున్నాడని నిఘా సంస్థలు చెబుతున్నాయి.