
Telangana Congress leader Madhu Yaskhi Goud: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. ఈ కేసులో మూడో విడత విచారణకు కవితను పిలిచిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వార్తాసంస్థ ఏఎన్ఐ తో కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ మాట్లాడుతూ.. ''ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేసినప్పుడు ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, 65 శాతం వాటాలు కలిగి ఉన్న కింగ్‌పిన్, సహ నిందితులు కవితను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు?.." అని అన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ లింక్డ్ మనీలాండరింగ్ కేసులో మూడో విడత విచారణకు వెళ్లినప్పుడు తాను ఇప్పటివరకు వాడిన ఫోన్ లు అన్నింటినీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యూఢిల్లీ కార్యాలయంలో సమర్పించినట్లు కవిత మంగళవారం తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మూడో విడత విచారణకు ముందు బీఆర్ఎస్ నాయకురాలు కవిత తాను ఉపయోగించిన మొబైల్ ఫోన్లను మీడియా ప్రతినిధులకు చూపించారు. సోమవారం ఢిల్లీలో ఆమెను ఈడీ దాదాపు పది గంటల పాటు విచారించింది.
కాగా, లండన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై మధుయాష్కి మాట్లాడుతూ.. భారత్ ను కించపరిచేలా రాహుల్ గాంధీ ఏమీ మాట్లాడలేదని అన్నారు. యూకేలో భారత ప్రజాస్వామ్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. 'నేను ప్రత్యక్ష సాక్షిని, రాహుల్ గాంధీతో కలిసి లండన్ వెళ్లాను. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారని, ఢిల్లీలో ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య సంస్థలు కూడా అణచివేతకు గురవుతున్నాయని, ప్రజల ప్రాథమిక హక్కులను అణచివేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ ను కించపరిచేలా ఆయన ఏమీ మాట్లాడలేదని" తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని కూడా ఆయన ఆరోపించారు.