
జమ్మూకాశ్మీర్‌లోని కర్నా సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో మాతా శారదా దేవి ఆలయాన్ని బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రపాలిత ప్రాంతంలో పాత సంప్రదాయాలు , సంస్కృతిని పునరుద్దరిస్తున్నామన్నారు. ఆలయాన్ని తెరవడం కొత్త ఉదయానికి నాంది అన్న ఆయన.. శారదా సంస్కృతిని పునరుద్ధరించాలనేది తన తపన అని అమిత్ షా పేర్కొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా మాతా శారదా మందిర్‌ను భక్తుల కోసం తెరవడం.. దేశవ్యాప్తంగా వున్న భక్తులకు శుభపరిణామమన్నారు. శారదా మాత ఆశీర్వాదం రాబోయే శతాబ్ధాల పాటు దేశమంతటా వుంటుందన్నారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని అమిత్ షా పేర్కొన్నారు. తాను జమ్మూకాశ్మీర్‌ను ఎప్పుడు సందర్శించినా .. మాతా శారదా దేవి ఆలయానికి నమస్కరించి తన పర్యటనను ప్రారంభిస్తానని ఆయన స్పష్టం చేశారు. శారదా దేవి ఆశీస్సులు , నియంత్రణకు ఇరు వైపులా వున్న పౌర సమాజంపై వుండాలని అమిత్ షా ఆకాంక్షించారు.
శారదా మాతా మందిరం కోసం ఇన్నేళ్లపాటు చేసిన పోరాటానికి గాను సేవ్ శారదా కమిటీ అధ్యక్షుడు రవీంద్ పండితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఆలయ పునరుద్దరణకే కాకుండా శారదా సంస్కృతిని పునరుద్దరించే తపన తనకు వుందదని ఆయన తనతో అన్నారని అమిత్ షా వెల్లడించారు. కర్తార్‌పూర్ కారిడార్ తరహాలో నియంత్రణ రేఖ వెంబడి శారదా పీఠాన్ని తెరవాలని పండిత చేసిన డిమాండ్‌ను ప్రస్తావించిన కేంద్ర హోంమంత్రి.. దీనిపై తాము తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
శారదా మాతా ఆలయంతో పాటు జియారత్ షరీఫ్ రేషిమల, రామమందిరం, హలోటి గొంప ఆలయం, జగన్నాథ దేవాలయంతో సహా అనేక ఆలయాలు, సూఫీ ప్రదేశాలు పునరుద్దరించబడుతున్నాయని అమిత్ షా తెలిపారు. ఇందుకోసం రూ.65 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని, తొలి దశలో 35 స్థలాలను పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. 75 మతపరమైన ప్రదేశాలు, సూఫీ పుణ్యక్షేత్రాలను గుర్తించామని.. 31 మెగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, ప్రతి జిల్లాలో 20 సాంస్కృతిక ‘ఉత్సవ్’లు నిర్వహించామని షా చెప్పారు.
కాగా.. శారదా పీఠాన్ని ఒకప్పుడు భారత ఉపఖండంలో విద్యా కేంద్రంగా పరిగణించేవారు. ఇక్కడికి అఖండ భారత్‌తో పాటు సెంట్రల్ ఆసియా నుంచి కూడా విద్యార్ధులు వచ్చి చదువుకునేవారు. 6వ శతాబ్ధం నుంచి 12వ శతాబ్ధం వరకు శారదా పీఠం ఉపఖండంలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా వెలుగొందింది. అలాగే దేశ విభజన జరగడానికి పూర్వం శారదా దేవి ఆలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం విలసిల్లింది. అయితే దేశ విభజన తర్వాత అమ్మవారి ఆలయాన్ని, దానికి సమీపంలో వున్న గురుద్వారాను దుండగులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం మరోసారి ఇక్కడ శారదా దేవి విగ్రహాన్ని పున: ప్రతిష్టించడంపై హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా స్వాగతిస్తున్నారు.