
తమిళనాడులో గత కొన్ని రోజులుగా 'గెట్ అవుట్ మోదీ' అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద మూడు భాషల పాలసీని అమలు కచ్చితంగా అమలు చేయాలని లేదంటే, సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో తమళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై హిందీని రుద్దాలని చూస్తే ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోడీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోడీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.
దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవ్వడం మొదలైంది. అయితే దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ఐటీ విభాగాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ హ్యాష్‌ట్యాగ్ పోటీకి సవాలు విసిరారు. ఆయన డీఎంకే ఐటీ విభాగాన్ని ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్‌ట్యాగ్‌ను రాత్రంతా ట్వీట్ చేయాలని సవాలు విసిరారు. అదే సమయంలో తాను ఉదయం 6 గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం ప్రారంభిస్తానని ప్రకటించారు. సోషల్ మీడియాలో ఏ నినాదానికి ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో ఈ పోటీ ద్వారా తేలుతుందని అన్నామలై వ్యాఖ్యానించారు.
"మీరు మీ అన్ని వనరులను ఉపయోగించుకుని మీకు కావాల్సినన్ని ట్వీట్లు చేయండి. ఇద్దరి ట్వీట్లలో దేనికి ఎక్కువ రీచ్ ఉంటుందో చూద్దాం. ఉదయం 6 గంటల తర్వాత బీజేపీ సమయం మొదలవుతుంది" అని అన్నామలై స్పష్టం చేశారు. ఇక డీఎంకే ప్రభుత్వంపై కూడా అన్నమలై విమర్శలు గుప్పించారు. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని సమర్థంగా పాలించడంలో, పిల్లల భద్రత విషయంలో విఫలమైందని విమర్శించారు.
ఇదిలా ఉంటే ఇటీవల కకూర్‌లో జరిగిన బహిరంగ సభలో అన్నామలై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ‘గెట్ అవుట్ మోదీ’ అనడానికి ఆయనకు ధైర్యం ఉందా? అంటూ ఒకింత సహనాన్ని కోల్పోయారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం మరింత ముదిరింది. దీనికి కౌంటర్‌గా ఉదయనిధి స్టాలిన్ కూడా సవాల్ విసిరారు. "అన్నామలైకి ధైర్యం ఉంటే, డీఎంకే ప్రధాన కార్యాలయానికి రావవచ్చు' అంటూ సవాల్ విసిరారు. దీంతో ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపాయి.
అయితే అన్నామలై చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఉదయనిధి స్టాలిన్ నిరాకరించారు. ఆయన గురించి మాట్లాడటంలో ఆసక్తి లేదంటూ తేల్చిచెప్పారు. భాషా వివాదంపై మాట్లాడుతూ, "తమిళనాడు రాష్ట్రం భాషా హక్కుల కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించిన ప్రదేశం. అసలు ఎవరు రాజకీయ లబ్ది కోసం పని చేస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చారు. మరి తమిళనాడులో జరుగుతోన్న ఈ రాజకీయ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.