
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలు మరింత ముందుగానే ఎందుకు మొదలు పెట్టొద్దని ఆయన ప్రశ్నించారు. పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూల్‌కు వెళ్లుతున్నప్పుడు.. మనం ఎందుకు 9 గంటలకే వచ్చి విచారణ ప్రారంభించొద్దు అని అడిగారు. ఉదయం తొందరగా విచారణ ప్రారంభిస్తే.. తొందరగా విచారణ ముగించవచ్చని చెప్పారు. తద్వార సాయంత్రం మిగిలిన సమయాన్ని తదుపరి రోజు విచారించాల్సిన కేసులపై కొంత కసరత్తు చేయడానికి సమయం ఉంటుందని తెలిపారు.
పిల్లలు ఉదయం 7 గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు న్యాయమూర్తులు, అటార్నీలు ఉదయం 9 గంటలకే ఎందుకు పని ప్రారంభిచవద్దు? అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు యూయూ లలిత్, ఎస్ రవీంద్ర భట్, సుధాంశు ధూలియాల ధర్మాసనం శుక్రవారం ఒక గంట ముందుగా అంటే 9.30 గంటలకే విచారణ ప్రారంభించింది. రెగ్యులర్ టైమ్ 10.30 గంటలకు విచారణ ప్రారంభం అవుతుంది. కానీ, శుక్రవారం గంట ముందుగానే విచారణ ప్రారంభించారు.
నార్మల్ టైం కంటే ఒక గంట ముందుగా విచారణ చేపట్టడంపై సీనియర్ అటార్నీ ముకుల్ రోహత్గీ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై జస్టిస్ లలిత్ మాట్లాడుతూ, తన అభిప్రాయం ప్రకారం ఉదయం 9 గంటలకే విచారణ ప్రారంభించడం ఉత్తమం అని వివరించారు. తాను ఎప్పుడూ ఒక విషయాన్ని వాదిస్తుంటానని అన్నారు. పిల్లలు ఉదయం 7 గంటలకే పాఠశాలలకు వెళ్లుతుండగా.. మనం ఉదయం 9 గంటలకే బెంచ్ మీదకు ఎందుకు రాలేం అని అన్నారు. ఉదయం 9.30 గంటలకు విచారణ ప్రారంభించడం బాగున్నదని తెలిపారు.
కోర్టులు ఉదయాన్నే పని చేయడం ప్రారంభిస్తే.. వారి పని కూడా తొందరగా ముగుస్తుందని అన్నారు. తద్వార తదుపరి రోజు విచారించాల్సిన కేసు ఫైళ్లను రివ్యూ చేయడానికి ఎక్కువ సమయం చిక్కుతుందని తెలిపారు.
కోర్టులు ఉదయం 9 గంటలకే పని మొదలు పెట్టవచ్చని.. మధ్యలో బ్రేక్ కోసం 11.30గంటలకు తీసుకోవచ్చని జస్టిస్ లలిత్ అన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణలు ముగించవచ్చని తెలిపారు. తద్వారా జడ్జీలకు సాయంత్ర సమయం ఎక్కువ చిక్కుతుందని, ఆ సమయంలో మరెన్నో పనులు పూర్తి చేసుకోవచ్చని వివరించారు. కొత్త కేసుల్లో ముఖ్యంగా సుదీర్ఘ విచారణలు అవసరం లేని కేసుల్లో ఈ విధానం సరిగ్గా సరిపోతుందని తెలిపారు.
ఈ విధానం ఆగస్టు చివరి నుంచి అమలులోకి వస్తుందని రోహత్గీ ఆశించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సాగుతుంది.