మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యతి నర్సింగానంద్‌పై కేసు

Published : Jul 16, 2022, 04:24 AM IST
మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యతి నర్సింగానంద్‌పై కేసు

సారాంశం

యతి నర్సింగానంద్ సరస్వతిపై మరో కేసు నమోదైంది. మహాత్మా గాంధీపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కోటి మంది హిందువుల ఊచకోతకు మహాత్ముడు కారకుడని, ఇతర ఆరోపణలు చేసిన వీడియో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

లక్నో: ఇప్పటికే పలుమార్లు అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన యతి నర్సింగానంద్ సరస్వతి మరోసారి నోరుపారేసుకున్నట్టు తెలిసింది. ఈ సారి ఏకంగా జాతి పిత మహాత్మా గాంధీనే దూషిస్తూ మాట్లాడిన ఓ వీడియో వైరల్ అయింది. అనంతరం ఆయనపై ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో కేసు నమోదైంది.

ఘజియాబాద్‌లోని దస్నా దేవి టెంపుల్ హెడ్‌గా ఉన్న యతి నర్సింగానంద్ సరస్వతిపై అదే జిల్లాలోని మాసురి పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని 153ఏ, 505 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. గురువారం ఈ కేసు ఫైల్ అయినట్టు ఇండియా టుడే కథనం తెలిపింది.

జులై 13వ తేదీన మహంత్ యతి నర్సింగానంద్ సరస్వతి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఒక కోటి మంది హిందువుల హత్యకు మహాత్మా గాంధీ కారకుడని వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఆ రెండు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ నేపథ్యంలోనే యతి నర్సింగానంద్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ వీడియోలో మహాత్ముడిపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఆ వ్యాఖ్యలు సొసైటీలో అశాంతిని రగల్చడమే కాదు.. రూల్ ఆఫ్ లాకూ ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

డిసెంబర్ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హరిద్వార్‌లో కొందరు సాధువులు ఓ సదస్సు నిర్వహించారు. ఇందులో చాలా మంది ప్రసంగిస్తూ ముస్లింల మారణహోమానికి పాల్పడాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ముస్లిం వ్యక్తిని ప్రధాని కానివ్వరాదని, వారి జనాభా పెరగకుండా చూడాలని, వారిని సంహరించడానికి హిందు బ్రిగేడ్లు మెరుగైన ఆయుధాలు వాడాలని రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేశారు. ఈ సదస్సులో వారి ప్రసంగాలకు చెందిన కొన్ని క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మిలిటరీ చీఫ్‌లు, రిటైర్డ్ న్యాయమూర్తులు, కార్యకర్తలు, అంతర్జాతీయ ప్రముఖులూ స్పందించి ఖండించారు. ఈ సదస్సులోని విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యతి నర్సింగానంద్‌తోపాటు మరో 10 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ సదస్సు జరిగి నెల రోజులు గడిచిన తర్వాత తొలి అరెస్టు జరిగింది.

ఈ సదస్సుపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఈ కేసులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పది రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల తర్వాతే తొలి అరెస్టు జరిగింది. తర్వాతి రోజే యతి నర్సింగానంద్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్లిప్‌లు వైరల్ అయిన తర్వాత విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై తీవ్ర నిరసన వెలువడింది. వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యతి నర్సింగానంద్.. ఓ పోలీసు అధికారితో సన్నిహితంగా మెదులుతున్న వీడియో చర్చనీయాంశం అయిది. పోలీసులూ తమ వైపే ఉంటారని ఆయన బిగ్గరగా నవ్వుతున్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత తొలి అరెస్టు జరగ్గానే మీరంతా ఛస్తారు అంటూ గురువారం ఆయన పోలీసులపై దూషణలకు దిగారు.

కాగా, హరిద్వార్‌లో ఆ సదస్సు నిర్వహించిన వారిలో మాత్రం ఎలాంటి పశ్చత్తాపం కనిపించలేదు. అంతేకాదు, తాము ఏమీ తప్పు చేయలేదని స్పష్టం చేయడం గమనార్హం. ఈ సదస్సులో మాట్లాడిన ప్రభోదానంద్ గిరి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను మాట్లాడిన దానికి సిగ్గు పడటం లేదని అన్నారు. తాను పోలీసులకు భయపడనని, తన మాటలకు కట్టుబడి ఉన్నారని వివరించారు. ఈయన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ దామిలతోనూ పలు ఫొటోల్లో కనిపించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu