
న్యూఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ కేంద్ర ప్రభుత్వ అభ్యర్థిపై సవాల్ చేయడానికి ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. తమ ఉమ్మడి అభ్యర్థిని ఈ ఎన్నికలో నిలబెట్టడానికి నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఈ ఉమ్మడి అభ్యర్థిని ఎన్డీయే తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థిని వెల్లడించాలని అనుకుంటున్నాయి.
రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే ప్రకటనకు ముందే.. ప్రతిపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. ఆ తర్వాత ఎన్డీయే గిరిజన మహిళ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాల్లోనూ ఒక మహిళ, అదీ గిరిజిన తెగకు చెందిన మహిళను ఎన్డీయే తమ రాష్ట్రపతి క్యాండిడేట్‌గా ప్రకటించడంతో పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆమెకు మద్దతు తెలుపడానికి వెళ్లాయి. అదీగాక, పలు గిరిజన తెగ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.
రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనలో ఎదుర్కొన్న పరాభవాన్ని ఉపరాష్ట్రపతి విషయం తప్పించుకోవాలని ప్రతిపక్షాలు డిసైడ్ చేసుకున్నాయి. అందుకే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని ఢీకొంటూ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయంతోపాటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి చుక్కులు చూపెట్టడానికి ఏ స్ట్రాటజీ ఫాలో కావాలనే విషయమై ప్రతిపక్ష పార్టీలు భేటీ అయినట్టు తెలిసింది. ఉమ్మడి ప్రతిపక్షాల కూటమిలో తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ సహా పలు పార్టీలు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ కూడా ఉన్నది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఈ ప్రతిపక్ష కూటమి ఒడిశా అధికారిక పార్టీ బీజేడీని ఆహ్వానించలేదు. రాష్ట్రపతి అభ్యర్థితోపాటు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికే బీజేడీ మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాత్రం ఈ ప్రతిపక్షాల నిర్ణయంపై స్పందించలేదు. ప్రతిపక్షాల కామెంట్లపై అరుదుగా ఈ పార్టీ స్పందిస్తున్నది. ఇది వరకు ఉన్న ట్రాక్ రికార్డు ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్డీయే పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తుందని ప్రతిపక్షాల కూటమి భావిస్తున్నట్టు తెలుస్తున్నది.