తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. బీజేపీతో ఏఐఏడీఎంకే పొత్తు రద్దు చేసుకుంది. కొత్త కూటమి ఏర్పాటు చేసి దానికి సారథ్యం వహిస్తామని ఏఐఏడీఎంకే తాజాగా వెల్లడించింది. పార్లమెంటు ఎన్నికల ముంగిట ఈ నిర్ణయం బీజేపీకి గడ్డు కాలాన్నే తెచ్చిపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులో ద్రవిడ పార్టీలతో బీజేపీ పొత్తుల చరిత్రలో ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి విడిపోయాయి.
హైదరాబాద్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. బీజేపీతో పొత్తును తెంచుకున్నట్టు ఏఐఏడీఎంకే మూడు రోజుల క్రితం వెల్లడించింది. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోబోమని, కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో తమిళనాడులో ఏం జరుగుతున్నదనే? ఆసక్తి మొదలైంది.
ద్రవిడ వర్సెస్ హిందూత్వ
తమిళనాడు ద్రవిడ రాజకీయాలకు ప్రసిద్ధి. ఇక్కడ అధికారం కోసం పోటీ పడే రెండు పార్టీలూ ద్రవిడ పార్టీలే. ఇంతకుముందు ఏఐఏడీఎంకే అధికారంలో ఉంటే.. ఇప్పుడు డీఎంకే గద్దెనెక్కింది. దక్షిణాదిలో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి అతికష్టమైన రాష్ట్రం ఏదైనా ఉంటే అది తమిళనాడు రాష్ట్రమే. అక్కడి ద్రవిడ రాజకీయాలు హిందూత్వ రాజకీయాలను అంగీకరించడం దాదాపు అసాధ్యమే. అందుకే అక్కడి ద్రవిడ పార్టీలతో బీజేపీ పొత్తులో ఉంటూ ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల ముంగిట ఏఐఏడీఎంకే హ్యాండ్ ఇవ్వడం బీజేపీకి దెబ్బే అని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లోనూ ఇది కీలక పరిణామం. ఏఐఏడీఎంకే తీసుకునే తర్వాతి నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
Also Read: 2024 ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పరుస్తాం.. బీజేపీ చీఫ్‌ను తొలగించాలని కోరలేదు: ఏఐఏడీఎంకే సంచలనం
బీజేపీ పొత్తుల చరిత్ర
1998 లోక్ షభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కానీ, ఈ పొత్తు ఒక్క ఏడాది మాత్రమే సాగింది. అప్పుడు జయలలిత అవినీతి కేసు వ్యవహారం వేడిగా ఉంది. ఏఐఏడీఎంకే నేతలు బీజేపీపై ఒత్తిడి తెచ్చారు. కానీ, అది ఫలించలేదు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలారు. అదే కాలంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంలో బీజేపీ ఓడిపోయి ప్రభుత్వం కూలిపోవాల్సి వచ్చింది కూడా.
1999 జనరల్ ఎలక్షన్స్‌లో ఏఐఏడీఎంకే కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. బీజేపీ కరుణానిధి డీఎంకేతో జట్టు కట్టింది.
2004 జనరల్ ఎలక్సన్స్‌కు కొన్ని నెలల ముందు డీఎంకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పుడు బీజేపీ, ఏఐఏడీఎంకే పొత్తు కట్టినా.. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఎన్నికల తర్వాత కూటమి రద్దయింది.
2016లో జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే మళ్లీ బీజేపీతో పొత్తుకు మొగ్గింది. 2019 లోక్ సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జట్టుగా వెళ్లాయి. ఎన్డీఏ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా.. రాష్ట్రంలో మాత్రం ఓడిపోయింది.
పొత్తు రద్దుకు బీజం అప్పుడే
ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు రద్దవ్వడంపై చాలా మంది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమళై వైపు వేళ్లు చూపిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య విభేదాలకు అన్నమళై కామెంట్లు ప్రధానంగా పని చేశాయని చెబుతున్నారు. పొత్తు రద్దుకు 2022 జూన్‌లో బీజం పడింది. రాష్ట్రంలో తమ పార్టీని పణంగా పెట్టి బీజేపీ ఎదగాలని చూస్తున్నదని ఏఐఏడీఎంకే నేత సీ పొన్నాయన్ అన్నారు.
2023 ఫిబ్రవరిల ఎరోడ్ ఉపఎన్నిక సమయంలో ఏఐఏడీఎంకే బ్యానర్లు చర్చనీయాంశమయ్యాయి. ఎన్డీఏ కూటమి అని కాకుండా.. ఏఐఏడీఎంకే కూటమి అని బీజేపీకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే యత్నం చేసింది.
Also Read: అవకాశవాదం కాదు, పార్టీని కాపాడుకోవడానికే బీజేపీతో పొత్తు .. దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
మార్చి 2023లో బీజేపీ ఐటీ వింగ్ నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ ఏఐఏడీఎంకేలో చేరినప్పుడూ రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.
అన్నమళై కూడా పలుమార్లు ఏఐఏడీఎంకే మాజీ నేతలు, మాజీ సీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో తమిళనాడు పాలించిన పార్టీల అవినీతి చరిత్రను బట్టబయలు చేస్తానని పరోక్షంగా జయలలితపై కామెంట్లు చేశారు. అవినీతి కేసులో దోషిగా తేలిన ఏకైక తమిళనాడు సీఎం ఏఐఏడీఎంకే నేత జయలలితనే. ‘జయలలిత కంటే నా భార్య 100 శాతం శక్తిమంతురాలు’ అని అన్నమళై చేసిన వ్యాఖ్యలపైనా ఏఐఏడీఎంకే నేతలు తీవ్రంగా ఆగ్రహించారు. అలాగే, ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం సీఎన్ అన్నాదురై పైనా అన్నామళై నోరుపారేసుకున్నారు. ఏఐఏడీఎంకే బీజేపీ నేతలను ప్రలోభపెడుతున్నదని కామెంట్ చేస్తూ తాను షాపింగ్ చేయడం మొదలు పెడితే లిస్ట్ పెద్దగా ఉంటుందని అన్నారు.
జయలలిత, అన్నాదురైల పై అన్నమళై చేసిన వ్యాఖ్యలను ఏఐఏడీఎంకే నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అన్నమళై అలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని అమిత్ షా, జేపీ నడ్డాలను కోరారు.
చివరకు సెప్టెంబర్ 18వ తేదీన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ఏఐఏడీఎంకే ప్రకటించింది.