WHO: చైనా టీకాలకు అనుమతులిచ్చి.. కొవాగ్జిన్‌ను ఎందుకు ఆపారు?.. డబ్ల్యూహెచ్‌వో సమాధానమిదే..!

By telugu teamFirst Published Oct 29, 2021, 1:21 PM IST
Highlights

చైనా కంపెనీల టీకాలకు పూర్తిస్థాయి సమాచారం లేకున్నా అనుమతులు ఇచ్చారని, కొవాగ్జిన్ టీకాకు ఎందుకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని డబ్ల్యూహెచ్‌వోపై ప్రశ్నలు కురిపించారు. దీనికి దేశాలు, తయారు చేసిన కంపెనీలకు అతీతంగా తాము టీకా డేటాను సమీక్షిస్తామని, ఒక టీకాపై వేగంగా, మరో టీకాపై మందగమనంగా ప్రక్రియలు నిర్వహించబోమని సంస్థ స్పష్టం చేసింది. వచ్చే వారంలో కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతుల ప్రతిపాదనలు అందే అవకాశముందని తెలిపింది.
 

న్యూఢిల్లీ: Covaxin టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులపై చర్చ తీవ్రమవుతున్నది. అదనపు సమాచారం కావాలని అడగుతూ తరుచూ అనుమతులను వాయిదా వేస్తున్న ఈ సంస్థపై అసహనం పెరుగుతున్నది. అదీగాక, ఈ మధ్యే రెండు చైనా Vaccineలకు వేగంగా.. అదీ పూర్తిస్థాయి సమాచారం అందించనేలేదనే ఆరోపణల నేపథ్యంలో అనుమతులు ఇవ్వడం ఈ చర్చను వేడెక్కించింది. దీనిపై WHOపై ప్రశ్నలు కురిశాయి. వీటికి ఆ సంస్థ ఓపిగ్గా సమాధానాలూ ఇచ్చింది.

భారత పరిశ్రమను తాము నమ్ముతామని, India ప్రపంచానికి అనూహ్యస్థాయిలో వివిధ రకాల టీకాలను సరఫరా చేస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. Bharat Biotech నుంచి తాము రోజువారీగా అనుసంధానంలో ఉన్నామని, అవసరమైన సమాచారం కోసం, వివరణల కోసం రెగ్యులర్‌గా సంభాషిస్తున్నామని వివరించింది. ఈ నెల 26న నిపుణుల కమిటీ భేటీ అయి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా డేటాను సమీక్షించిందని, వాటిపై అదనపు వివరణలను కంపెనీని అడిగిందని చెప్పింది. ఈ కమిటీ వచ్చే నెల 2వ తేదీన మరోసారి సమావేశమవుతుందని తెలిపింది. బహుశా వచ్చే వారంలోనే కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతులకు ప్రతిపాదనలు పంపే అవకాశముందని వివరించింది.

అత్యవసర వినియోగ అనుమతుల కోసం భారత్ బయోటెక్ ఏప్రిల్ 26న డబ్ల్యూహెచ్‌వోకు దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి అనుమతుల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది.

Also Read: కొవాగ్జిన్‌‌పై అదనపు వివరణలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా పెండింగ్‌లోనే..

చైనా టీకాలు సినోఫామ్, సినోవాక్ టీకాలకు పూర్తిస్థాయి సమాచారం లేకున్నా అనుమతులు ఇచ్చారని, అలాంటప్పుడు కొవాగ్జిన్‌కు అనుమతులు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యమవుతున్నదని అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ జనరల్ అసిస్టెంట్ డాక్టర్ మరియెంగెల సిమావో స్పందించారు. 

భారత్ బయోటెక్ వేగంగా, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నదని డాక్టర్ సిమావో వివరించారు. అయితే, చివరిసారిగా డేటాను ఇటీవలే అంటే ఈ నెల 18వ తేదీన సమర్పించిందని తెలిపారు. అనంతరం 26వ తేదీన నిపుణుల కమిటీ సమావేశమైందని అన్నారు. నవంబర్ 2న మరోసారి సమావేశమై డబ్ల్యూహెచ్‌వోకు ప్రతిపాదనలు పంపే అవకాశముందని చెప్పారు. ఒక టీకాపై వేగంగా స్పందించి మరో టీకాపై అలసత్వంగా వ్యవహరించరని, నిజానికి తాము భారత పరిశ్రమను చాలా విశ్వసిస్తామని తెలిపారు. ప్రపంచానికి కావాల్సిన అనేక విలువైన టీకాలను అధికమొత్తంలో ఈ దేశ పరిశ్రమనే అందించిందని వివరించారు. కొవాగ్జిన్ టీకా అత్యవసర అనుమతులపై తుది దశలో చర్చలు జరుగుతున్నాయని, వచ్చేవారంలో ప్రతిపాదనలు అందవచ్చని తెలిపింది.

చైనా టీకాల అనుమతులకూ అదనపు వివరణలు, సమాచారాన్ని నిపుణుల కమిటీ కోరిందని, ఆ టీకాల అత్యవసర అనుమతుల కోసమూ సమగ్ర ప్రక్రియను డబ్ల్యూహెచ్‌వో చేపట్టిందని డాక్టర్ సిమావో స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ తొలి భేటీ తర్వాత నెల రోజులకు ఓ టీకాకు అనుమతులు లభించగా, మరో టీకాకు ఆరు వారాల కాలం పట్టిందని వివరించారు. ప్రస్తుతం అత్యవసర అనుమతుల కోసం డబ్ల్యూహెచ్‌వో ఎనిమిది టీకాలను సమీక్షిస్తున్నదని తెలిపారు.

డబ్ల్యూహెచ్‌వో ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా ఉంటుందని ఆమె వివరించారు. అత్యవసర అనుమతుల ప్రక్రియ కోసం వేర్వేరు దేశాలకు చెందిన ఆరుగురు నిపుణులతో కమిటీ వేసి టీకా సమాచారంపై సమీక్షిస్తామని తెలిపారు. వారి ప్రతిపాదనల తర్వాత అత్యవసర అనుమతులు అందుతాయని వివరించారు. భారత్ బయోటెక్ జులై 6వ తేదీ నుంచి సమాచారాన్ని సమర్పిస్తున్నదని తెలిపారు. కొవాగ్జిన్‌ను తాము అర్జెంట్ అంశంగా తీసుకుంటున్నామని వివరించారు. తమ బృందాలు ఎప్పటికప్పుడు దీనిపై పనిచేస్తున్నాయని చెప్పారు.

Also Read: 24 గంటల్లో కొవాగ్జిన్‌కు అనుమతి!.. డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే..

ఒక్కోసారి ఆ దేశ కంపెనీలను తనిఖీ చేస్తామని, ఇదే ఏడాదిలో భారత్‌కు చెందిన ఓ సంస్థను ఇన్‌స్పెక్ట్ చేశామని, ఇది భారత్ బయోటెక్ గురించి కాదని వివరించారు.

ప్రజల ప్రాణాలు కాపాడే ప్రాడక్ట్స్ ఏవీ కూడా పనికి రాకుండా ఉండాలని తాము భావించబోమని, ప్రజల ప్రాణాలకే తమ ప్రథమ ప్రాధాన్యత అని మరో అధికారి వివరించారు. కానీ, అలాంటి ఉత్పత్తుల సేఫ్టీ, సామర్థ్యాలనూ కచ్చితత్వంతో పరిశీలిస్తామని తెలిపారు.

click me!