టెంట్‌ బాయ్‌ టు సీఎం: పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఎవరో తెలుసా?

By telugu teamFirst Published Sep 19, 2021, 6:54 PM IST
Highlights

పంజాబ్ నూతన సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాష్ట్రంలో తొలి దళిత సీఎంగా నిలవనున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కెప్టెన్‌పై తిరుగుబాటు చేసిన వారిలోనూ ఆయన ఉండటం గమనార్హం. ఆర్థికంగా వెనకబడిన కుటుంబంలో జన్మించిన తండ్రి మొదలుపెట్టిన టెంట్ హౌజ్ బిజినెస్‌లో చిన్నప్పుడు టెంట్ బాయ్‌గా పనిచేశారు.
 

చండీగడ్: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరిగాయి. సింగిల్ డేలోనే కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో మరో నేతను ఎన్నుకోవడం చకచకా జరిగిపోయాయి. నూతన సీఎం ఎంపికపై కాంగ్రెస్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ నూతన సీఎంగా ఎన్నుకుంది. మొన్నటి వరకు మంత్రిగా చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

47ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ట్రెయినింగ్ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించారు. చాంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన రమదాసియా సిక్కు కమ్యూనిటీకి చెందినవారు. ఈ కమ్యూనిటీ దళిత వర్గంలో భాగం. దీంతో పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నిలిచారు. కెప్టెన్‌పై తిరుగుబావుటా ఎగరేసినవారిలో చన్నీ కూడా ఉండటం గమనార్హం.

చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో 1972 ఏప్రిల్ 2న చాంకౌర్ సాహిబ్ సమీపంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తండ్రి ఎస్ హర్షా సింగ్ మలేషియాకు వెలసవెళ్లాల్సి వచ్చింది. అనంతరం వ్యాపారంలోకి దిగి సక్సెస్ అయ్యారు. మలేషియా నుంచి తిరిగి వచ్చాక ఖరార్ పట్టణంలో సెటిలై టెంట్ హౌజ్ బిజినెస్ పెట్టుకున్నారు. ఇందులో చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా టెంట్ బాయ్‌గా పనిచేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకతను నిలువరించడానికి గుజరాత్‌లో బీజేపీ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లోనూ చోటుచేసుకున్న తాజా పరిణామాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపకరించేలాగే కాంగ్రెస్ మలుచుకున్నట్టు అర్థమవుతున్నది. ముఖ్యంగా దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ఇదే ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్‌లో మూడింట ఒకవంతు జనాభా దళితులే. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎంపికే సరైందని కాంగ్రెస్ భావించి ఉండొచ్చని తెలుస్తున్నది.

click me!