గుజరాత్ నూతన సీఎం భూపేంద్ర పటేల్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ?

By telugu teamFirst Published Sep 12, 2021, 7:26 PM IST
Highlights

గుజరాత్ నూతన సీఎంగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలో పోటీకి దిగడానికి బీజేపీకి కనిపించిన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ నిన్న రాజీనామా చేశారు. బీజేపీ శాసనసభా పక్ష ఈ రోజు నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకుంది. భూపేంద్ర పటేల్ సారథ్యంలోనే 2022 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దిగనుంది. విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గంపై ప్రజల్లోని వ్యతిరేకతను తప్పించుకోవడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషణలు వచ్చాయి. అయితే, బీజేపీ విశ్వసిస్తున్న భూపేంద్ర పటేల్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో ఓ సారి పరిశీలిద్దాం.

గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్‌‌తో సాన్నిహిత్యమున్న పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఘట్లోడియా నియోజకవర్గంలో శశికాంత్ పటేల్‌పై 1.17లక్షల ఓట్ల మెజార్టీతో రికార్డు నమోదు చేశారు. ఈ నియోజకవర్గానికి అంతకు క్రితం ఆనందిబెన్ పటేల్ ప్రాతినిధ్యం వహించారు.

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన 59ఏళ్ల భూపేంద్ర పటేల్ గుజరాత్‌లోని ఉత్తర ప్రాంతం, సౌరాష్ట్రలో అధిక ప్రాబల్యమున్న పాటిదార్ కమ్యూనిటీకి చెందినవారు. పాటిదార్ కమ్యూనిటీ సబ్ క్యాస్ట్ కడ్వాకు చెందినవారాయన. గుజరాత్‌లో విజయానికి పాటిదార్ కమ్యూనిటీ నిర్ణయాత్మకంగా ఉన్నది. రాష్ట్ర ఎకానమీపైనా పట్టున్న కోఆపరేటివ్ సెక్టార్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, కన్‌స్ట్రక్షన్‌లలో వీరిదే కీలకపాత్ర. 

వివాదరహితుడిగా ఉన్న భూపేంద్ర పటేల్‌కు రాష్ట్రంలోని వ్యాపారవర్గాలతోనూ సన్నిహిత సంబంధమున్నది. ఆయన సీఎంగా ఎంచుకోవడానికి ఈ అంశమూ కలిసొచ్చింది. ఆయన ఇదివరకు మంత్రిగా చేయకున్నా, అందుకు కావాల్సిన అనుభం ఆయన దగ్గర ఉన్నదని ఓ బీజేపీ నేత తెలిపారు. 

పాటిదార్ ఆర్గనైజేషన్లు సర్దార్ ధామ్, విశ్వ ఉమియ ఫౌండేషన్‌‌లకు భూపేంద్ర పటేల్ ట్రస్టీగా ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు ఆయన అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి 2015 నుంచి 2017 వరకు చైర్మన్‌గా ఉన్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా 1995, 1996లో కొనసాగారు. మేమ్‌నగర్ పాలికకు 1999 నుంచి 2000 వరకు ప్రెసిడెంట్‌గా, స్కూల్ బోర్డ్ ఆఫ్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2008 నుంచి 2010 వరకు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తల్టేజ్ వార్డ్ నుంచి 2010 నుంచి 2015 వరకు కౌన్సిలర్‌గా ఉన్నారు.

click me!