తాలిబాన్‌ల ఉగ్రచర్యలను ఎదుర్కోవడానికి మిలిటరీకి శిక్షణ! కశ్మీర్‌లోని బలగాలకు ఇది తప్పనిసరి

By telugu teamFirst Published Sep 12, 2021, 6:39 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై దక్షిణాసియాలో చాలా దేశాలు ఉగ్రముప్పుపై కలవర పడుతున్నాయి. ఒకవేళ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగితే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా మిలిటరీ బలగాలకు తాలిబాన్ వ్యూహ ప్రతివ్యూహాలు, వారి ఎత్తుగడ, ఉగ్రవాదంలో వారి విధివిధానాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది.
 

శ్రీనగర్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడం మొదలు దక్షిణాసియాలో శాంతి భద్రతలపై కలవరం మొదలైంది. అన్ని దేశాలు ఉగ్రముప్పు పెరిగే  అవకాశముందన్న ఆలోచనల్లోనే ఉన్నాయి. నిఘా వర్గాలూ అదే తరహా హెచ్చరికలు చేయడంతో ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు పైచేయి సాధించడం భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం వేస్తుందని, ముఖ్యంగా జమ్ము కశ్మీర్‌లో దాని ప్రభావం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే భారత సరిహద్దులోని బలగాలు, కౌంటర్ టెర్రరిజంలో పనిచేస్తున్న దళాలకు తాలిబాన్‌ ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఉగ్రవాదంలో దాని తీరుతెన్నులపై శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న బలగాలకు తప్పనిసరిగా శిక్షణ అందించనుంది.

ఇటీవలే సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ నుంచి ఈ మార్గదర్శకాలు భద్రతాబలగాలకు వెళ్లాయి. 9/11 తర్వాత జరిగిన పరిణామాలు, తాలిబాన్ల వ్యవహారంపై బలగాలకు ప్రాథమిక వివరాలైనా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. సరిహద్దుల్లో కాపుకాస్తున్న బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, స్టేట్ పోలీసు యూనిట్లు సహా కౌంటర్ టెర్రరిజం విధులు నిర్వర్తించే సీఆర్‌పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులకు ఈ శిక్షణ ఉన్నదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. గత శిక్షణలో తాలిబాన్లపై వివరాలు ఉన్నాయని, కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందులో చేర్చలేదని తెలిపారు. ఫుల్ ఫ్లెడ్జ్ ట్రెయినింగ్, ఇంటెలిజెన్స్ సహా తాలిబాన్లను ఎదుర్కొనే విధానాలు, దాని నాయకత్వం, ఉగ్రవాదంలో అది ఎంచుకునే వ్యూహాల గురించి శిక్షణలో తెలియజేస్తామని పేర్కొన్నారు.

ఉన్నతస్థాయి అధికారులకు వీటిపై అవగాహన ఉండొచ్చని, కానీ, వీరు మళ్లీ క్షేత్రస్థాయి బలగాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని, కాబట్టి, వారికి ఈ శిక్షణ ముఖ్యమని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికి రెండు కేంద్ర బలగాలకు కనీసం ఒక సెషన్ అయినా నిర్వహించినట్టు కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

click me!