Indian Navy Veterans: గత సంవత్సరం నుంచి ఖతార్‌లో కస్టడీలో ఉన్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఈ షాకింగ్ తీర్పుపై స్పందించిన భారత్.. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఈ కేసుకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామనీ, దీన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే, ఎందుకు భారత వెటరన్లకు ఖతార్ మరణ శిక్ష విధించింది? ఆ అధికారులు ఎవరు..? అనే విషయాలు గమనిస్తే..
8 Indian Navy Veterans Facing Death Sentence: గత ఏడాది నుంచి ఖతార్‌లో కస్టడీలో ఉన్న ఎనిమిది మంది భారత నేవీ వెటరన్‌లకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం.. ఖతార్ కోర్టు ఆదేశాలను తాము వ్యతిరేకిస్తామని పేర్కొంది. ఈ కేసులో అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తామని తెలిపింది. అధికారులు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారనే అభియోగంతో గత ఏడాది ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ తీర్పుకు ముందు, వారి అభ్యర్థనలు అనేకసార్లు తిరస్కరించబడ్డాయనీ, ఖతార్ అధికారులు వారి నిర్బంధాన్ని పొడిగించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ షాకింగ్ తీర్పుపై భారత్ స్పందిస్తూ.. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఈ కేసుకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామనీ, దీన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. తాము అన్ని కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.
8 మంది నేవీ వెటరన్లు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎంటీ కేసు..?
ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేసేవారు. ఈ కంపెనీ రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఖమీస్ అల్-అజ్మీకి చెందినది. అయితే, ఈ ఎనిమిది మంది వ్యక్తులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టు 30, 2022న అరెస్టు చేసింది. వీరితో పాటు, ఆ సంస్థ యజమాని అజ్మీని గత సంవత్సరం అరెస్టు చేయగా, ఆయన నవంబర్ లోనే విడుదల అయ్యారు. సంబంధిత రిపోర్టుల ప్రకారం.. ఖతార్ కు చెందిన స్టెల్త్ జలాంతర్గాములపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసినట్లు వీరిపై అభియోగాలు మోపారు. ఎనిమిది మంది భారతీయ నావికాదళ అనుభవజ్ఞులపై మార్చి 25 న అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఖతార్ చట్టం ప్రకారం వారిని అరెస్టు చేసినప్పటి నుండి వారిని నిర్బంధంలో ఉంచారు. అలాగే, అల్ దహ్రా గ్లోబల్ సంస్థ దోహాలో తన కార్యకలాపాలను మూసివేయవలసి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న వారిలో చాలా మంది భారత పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
ఈ ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులు వీరే..
అరెస్టయిన వారిలో కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, నావికుడు రాజేష్ గోపకుమార్‌లతో సహా ఒకప్పుడు ప్రధాన భారత యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన అలంకృత అధికారులు ఉన్నారు. వీరందరూ కూడా భారత నౌకాదళంలో 20 సంవత్సరాల వరకు విశిష్ట సేవా రికార్డును కలిగి ఉన్నారు. వారిలో, కమాండర్ పూర్ణేందు తివారీ 2019లో విదేశీ భారతీయులకు అందించే అత్యున్నత పురస్కారమైన ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ను అందుకున్నారు.
భారత్ ముందు ఎలాంటి లీగల్ అంశాలు ఉన్నాయి..?
ఈ కేసులో వివరణాత్మక తీర్పు కోసం ఎదురుచూస్తున్నామనీ, అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నామని భారత్ తెలిపింది. ఖతార్‌లోని భారతీయులకు అన్ని కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది . అయితే, భారతదేశం అన్ని చట్టపరమైన విధానాలను దశల వారీగా, తదనుగుణంగా అనుసరించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో తొలి, ప్రధానమైన చర్య 'కతార్‌లోని న్యాయ వ్యవస్థలో అప్పీల్'. ఏదైనా గందరగోళం జరిగితే, భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానం అధికార పరిధిని ఆశ్రయించవచ్చు. మరణ శిక్షల విషయంలో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇదీ కుదరకపోతే ఈ అంశాన్ని అంతర్జాతీయంగా ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లవచ్చు.