
భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేసిన కరోనా (corona vaccine) వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు (covaxin) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదముద్ర వేసింది. కోవాగ్జాన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ (who) అనుమతించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ అడ్వైజరి కమిటీ ఆమోదముద్ర వేసింది. దీనిని 18 ఏళ్ల పైబడిన వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని అనుమతికి భారత్ బయోటెక్ సంస్థ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కోవాగ్జిన్ అత్యవసర అనుమతికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదముద్ర వేసింది.
కాగా.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కొవాగ్జిన్’కు అనుమతి మంజూరు చేసే విషయమై.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే తెలిపింది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డేటా క్రోడీకరణ ఈ ఏడాది జూన్ లోనే పూర్తయ్యింది.
ALso Read: భారత్ బయోటెక్‌కు ఊరట.. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) నిమిత్తం భారత్ బయోటెక్ ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పూర్తి స్థాయిలో సమర్పించింది. అక్టోబర్ లో నిర్ణయం వెల్లడిస్తామని అప్పుడే తన వెబ్‌సైట్ లో పేర్కొంది. ఇదిలా ఉండగా, భారత మహిళల చెస్ నెంబర్ వన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి (koneru hampi) ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీం చెస్ చాంపియన్షిప్ కోసం బాగా సిద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్లైన్ పోటీల్లో చురుగ్గా పోటీ పడింది. అయితే తీరా స్పెయిన్ ఈవెంట్ ఆడదాం అనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ హంపి భారత్‌లో తయారైన కోవాగ్జిన్ టీకా తీసుకుంది. కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లేదు. దీనివల్ల ఆమె స్పెయిన్ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రోటోకాల్ పాటించాలి. పది రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలి. ఈ విషయాలన్నీ హంపీకి స్పెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిసాయి. ‘నార్త్ మెసిడోనియా మీదుగా స్పెయిన్ వెళ్లాలనుకున్నా. కానీ అక్కడ స్పెయిన్ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి. అక్కడా పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు’ అని హంపీ వివరించింది. ఇప్పుడు తాజాగా కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి రావడంతో ఇలాంటి కష్టాలకు చెక్ పడనుంది.