
ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లా మైత్రి బాగ్ జూలో ఓ తెల్లపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో రాయ్ పూర్ కు 35 కిలోమీటర్ల దూరంలోని భిలాయ్ నగరంలో ఉన్న జంతుప్రదర్శనశాలలో ఉన్న తెల్ల పులుల సంఖ్య తొమ్మిదికి చేరుకుందని అధికారులు తెలిపారు.
‘‘ఏప్రిల్ 28న రక్ష అనే తెల్లపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. తెల్లపులి పిల్లలకు తండ్రి సుల్తాన్. పశువైద్య నిబంధనల ప్రకారం తన పిల్లలకు తల్లి పాలిచ్చేందుకు, ఇతర ఆరోగ్య ప్రమాణాల పర్యవేక్షణ కోసం తల్లితో పాటు పిల్లలను చీకటి గదిలో ఉంచుతారు’’అని జూ ఇన్చార్జ్ ఎన్కే జైన్ తెలిపారు. నాలుగు నెలల కేర్ పీరియడ్ పూర్తయిన తర్వాత పిల్లలను ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
‘‘గత ఏడాది సెప్టెంబర్ లో రోమా అనే తెల్లపులి ఒక పిల్లకు జన్మనిచ్చింది. దీనికి ‘సింగం’ అని పేరు పెట్టారు. దీనికి కూడా తెల్లపులి సుల్తానే తండ్రి ’’ అని జైన్ తెలిపారు. కాగా ప్రస్తుతం జూలో నవజాత శిశువులతో సహా తొమ్మిది తెల్ల పులులు ఉన్నాయి. పొరుగున ఉన్న ఒడిశాలోని నందన్ కానన్ జంతుప్రదర్శనశాల నుంచి 1997లో తొలిసారిగా తరుణ్, తాప్సీ అనే తెల్ల పులులను మైత్రీ బాగ్ కు తరలించారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు మంగళ్ ధిల్లాన్ కన్నుమూత
కాగా.. దేశంలోని అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఫ్లాగ్షిప్ యూనిట్ అయిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ (బీఎస్పీ) మైత్రి బాగ్ ను నిర్వహిస్తుంటుంది.