
ప్రముఖ పంజాబీ, హిందీ సినీ నటుడు, దర్శకుడు మంగళ్ ధిల్లాన్ (48) కన్నుమూశారు. క్యాన్సర్ తో సుదీర్ఘ కాలం పోరాడిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. మరణానికి ముందు మంగళ్ ను లుధియానా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. మరో వారం రోజుల్లో (జూన్ 18) ఆయన పుట్టినరోజు ఉందనగా.. ఈలోపే ఇలా జరగడం విషాదకరం.. అయితే ఆయన అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మంగళ్ ధిల్లాన్ పంజాబ్ లోని ఫరీద్ కోట్ జిల్లాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు. పంజ్ గ్రాయిన్ కలాన్ ప్రభుత్వ పాఠశాలలో తన ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేశాడు. ఆ తర్వాత తన తండ్రి పొలానికి సమీపంలోని ఉత్తరప్రదేశ్ కు మకాం మార్చాడు. అక్కడే లఖింపూర్ ఖేరి జిల్లాలోని నిగాసన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పదో తరగతి పూర్తి చేశాడు.
ఆయన ఢిల్లీలోని ఒక థియేటర్లో కూడా పనిచేశాడు. 1980లో నటనలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. మంగళ్ 1986లో కథా సాగర్ అనే టీవీ షోతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది బునియాద్ అనే మరో టీవీ షోలో నటించారు. జునూన్, కిస్మత్, ది గ్రేట్ మరాఠా, పాంథర్, ఘుతాన్, సాహిల్, మౌలానా ఆజాద్, ముజ్రీమ్ హజీర్, రిష్తా, యుగ్, నూర్జహాన్ తదితర ప్రదర్శనలు ఇచ్చారు.
జర్నలిస్టుతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాగ్వాదం.. వీడియో పోస్టు చేస్తూ మండిపడ్డ కాంగ్రెస్.. వైరల్
మంగళ్ ధిల్లాన్ ఖూన్ భరి మాంగ్, జఖ్మీ ఔరత్, దయావన్, కహాన్ హై కనూన్, నాకా బండి, అంబా, అకైలా, జనషీన్, ట్రైన్ టు పాకిస్తాన్, దలాల్ వంటి అనేక చిత్రాలలో నటించారు. చివరిసారిగా 2017లో తూఫాన్ సింగ్ చిత్రంలో లఖాగా కనిపించారు. ఆయన మరణం పట్ల సోషల్ మీడియాలో పలువురు సంతాప సందేశాలు పోస్టు చేస్తున్నారు.