
అన్ని మతాల్లాగే ఇస్లాం కూడా మానవ జీవితానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రాణాన్ని నిలిపి ఉంచడానికి విలువనిచ్చే ఈ మతం కొన్ని సందర్భాల్లో, కొన్ని షరతులకు లోబడి అబార్షన్‌కు అనుమతి ఇస్తుంది.
ఇస్లాం ముఖ్యమైన లక్ష్యాల్లో జీవితాన్ని కాపాడటం ఒకటి. కాబట్టి, ఒక అమాయక ఆత్మను చంపేయడం ఘోర నేరంగా పరిగణిస్తుంది. ‘హత్య చేయడానికి అల్లా నిషేధించిన ఆత్మను చంపేయకండి. న్యాయం కోసం మాత్రమే ఇది మినహాయింపు’ అని ఖురాన్ చెబుతున్నది. అదే విధంగా సంతానాన్ని దేవుడి ఆశీర్వాదంగా భావిస్తారు. ఖురాన్‌లో ఎందరో ప్రవక్తలు ఉదాహరణకు జకారియా, అబ్రహం వంటి వారు కూడా తమకు సమర్థుడైన కొడుకును ఇవ్వాలని మొరపెట్టుకున్నారు.
ఇస్లామిక్ అరేబియాకు ముందు మగ శిశువులపై అరబ్‌లకు అమిత ప్రేమ ఉండేది. ఆడ పిల్లలు పుడితే పాతిపెట్టేవారు. ఈ దారుణ చర్యను ఖురాన్ తీవ్రంగా ఖండించింది. కూతురు పుట్టిందని ప్రకటించగానే ఆయన ముఖం పాలిపోతుందని, ప్రజల నుంచి ముఖం చాటేసి వెళ్లిపోతాడని ఖురాన్ పేర్కొంది. అయితే, ఆ ఆడ శిశువును అవమానంతో ప్రాణాలతోనే పాతి పెట్టాలా? వాళ్ల నిర్ణయం ఒక సైతాన్ నిర్ణయమే అని వివరించింది. ఆ సమయంలో అధికంగా ఉండిన ఆడ పిల్లలను పాతిపెట్టే ధోరణిని మహమ్మద్ ప్రవక్త నిషేధించారు.
అబార్షన్ విషయానికి వస్తే గర్భం దాల్చిన తొలి 40 రోజుల్లో కొన్ని షరతులకు లోబడి అనుమతులు ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరికీ సమ్మతమై, ఒక మంచి కార్యం గురించి ఆ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని చాలా మంది అకడమిక్స్ అబార్షన్‌కు అనుమతిస్తారు. అదనంగా, అత్యాచారానికి గురైన సందర్భంలోనూ అబార్షన్‌కు అనుమతి ఉంటుంది. లేదా భౌతిక, మానసిక సమస్యల కారణంగా ఆ పాపను పెంచే సమర్థత లేనప్పుడూ అబార్షన్‌కు అనుమతి ఉంటుంది. అయితే, ఈ శిశువు జన్మిస్తే పేదరికంలోకి జారిపోవడం తథ్యమనే భయంతో అబార్షన్ చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు.
Also Read: భారత్ నా దేశం; ఇస్లాం నా మతం
40 రోజుల అవధి దాటితే అబార్షన్‌కు అనుమతి ఇచ్చే విషయంపై చాలా మంది ముస్లిం స్కాలర్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, తల్లి ఆరోగ్యానికే ముప్పు ఉంటే, లేదా పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా పెరిగి అర్థవంతమైన జీవితాన్ని జీవించలేని సమస్యలు ఉంటే అబార్షన్ చేయడానికి మత పెద్దలు అనుమతులు ఇస్తారు. 40 రోజుల లోపైతే చాలా మంది ఆధునిక స్కాలర్లు అబార్షన్‌లకు అనుమతి ఇస్తారు. కానీ, ఆ అవధి దాటితే మాత్రం కచ్చితమైన కారణం ఉంటేనే అందుకు సమ్మతి తెలుపుతారు. ఈ కారణంగా కూడా ఏది పడితే అది ఉంటే కుదరదు. ముస్లిం స్కాలర్లు, మెడికల్ ఎక్స్‌పర్టుల అభిప్రాయాల ఆధారంగా దాని తీవ్రత అంచనా వేస్తారు.
120 రోజుల తర్వాత ఆ గర్భస్త పిండంలో దేవుడు ఆత్మ నింపుతాడని భావిస్తారు. కాబట్టి, తల్లికి ప్రాణ హాని లేదన్నంతవరకు ఈ కాలంలో అబార్షన్‌కు అనుమతి ఉండదు. ఆ శిశువు గర్భంలోనే మరణించినా అబార్షన్ చేసుకోవచ్చు.
---- ఎమన్ సకీనా