
భారత్, అమెరికాలు మిలిటరీ సంబంధాలను మరింత లోతుగా చేసుకుంటున్నాయి. ఒక కొత్త రక్షణ సహకార ఒప్పందాన్ని చేసుకుంటున్నాయి. ఆయుధాలను కలిసి తయారు చేయడం, ఫైటర్ జెట్ టెక్నాలజీకి సంబంధించి బలమైన ఆయుధ ఒప్పందాలు చేసుకోవడం ఇందులో ఉన్నాయి. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తన రెండు రోజుల భారత పర్యటనలో డిఫెన్స్ రోడ్ మ్యాప్ పై భారత అధికారులు అంగీకారం తెలిపారు. సంయుక్తంగా ఆయుధాల ఉత్పత్తి, అధునాతన సాంకేతిక ఆయుధాలను పొందడం గురించే ఈ రోడ్ మ్యాప్ ఉన్నది.
ఇందుకు సంబంధించి అమెరికా, భారత్‌లు ఒక కొత్త కార్యక్రమం ఇండస్ ఎక్స్ (INDUS X)ను రూపొందించాయి. దీని ద్వారా ఉభయ దేశాల్లోని ప్రైవేట్ కంపెనీలు రక్షణ పరిశ్రమలో సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వేగవంతం చేయడానికి వీలవుతుంది. ఈ నెలలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనలో అత్యున్నత రక్షణ ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఫైటర్ జెట్ ఇంజిన్లను కలిసి తయారు చేసే ఒప్పందం, అధికారికంగా ఇండస్ ఎక్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ఆయుధాలు, వాటి హార్డ్‌వేర్, స్పేర్ పార్ట్‌ల గురించి భారత్ రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించాలనే లక్ష్యంగానే అమెరికా ఇటీవల ఒప్పందాలు సూచిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2022లో అప్పటి యూకే పీఎం బోరిస్ జాన్సన్ కూడా భారత్ స్వయంగా ఫైటర్ జెట్ తయారు చేయడానికి సహకరిస్తామని ఆఫర్ చేశారు. ఇదే వారంలో జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ కూడా భారత్‌లో పర్యటించారు. దక్షిణాసియా దేశాల కోసం 5.2 బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కోసం జర్మనీ కంపెనీలు ప్రయత్నాల్లో ఉన్నాయని వెల్లడించారు.
భారత్‌కు ఎల్లకాలం వెన్నంటే ఉండే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధంలో తలమునకలై ఉన్నది. దీంతో భారత రక్షణ అవసరాల ఈ యుద్ధం కారణంగా నిర్లక్ష్యానికి గురయ్యే ముప్పు ఉన్నదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంలో అమెరికా సహాయ హస్తం ఇరుదేశాలకు కలిసి వస్తుందని చెబుతున్నారు.
ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను విమర్శించడంలో భారత్ వెనుకడుగు వేయడం అమెరికాకు మింగుడుపడటం లేదు. జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ రష్యాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ రజన్ కుమార్ పై అభిప్రాయాన్ని పేర్కొన్నారు.
రష్యాపై భారత్ ఆధారపడటం తగ్గిపోతే.. ఇండియా విదేశాంగ విధానాల్లోనూ మార్పులు తేగలమని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను భారత్ విమర్శించలేదు. అమెరికా, పశ్చిమ దేశశాలు వాటి మిలిటరీ వనరులను, ఆయుధ పరికరాలు, సాంకేతికతను పంచుకుంటే భారత్ కూడా రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటుందని కొందరి నిపుణులు భావిస్తున్నారు.
ఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ, స్ట్రాటజీ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ రాజేశ్వరీ పిళ్లై రాజగోపాలన్ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ దూరంగా కావాలంటే ముందుగా రష్యాపై భారత్ డిపెండెన్స్ తగ్గాలి. ఈ విషయాన్ని అమెరికా కూడా రియలైజ్ అయిందని, అందుకే రష్యాపై భారత్ ఆధారపడకుండా చూడాల్సిన ప్రాధాన్యతను గుర్తించిందని తెలిపారు.
అవాంతరాలు, ఆలస్యాలు:
భారత్‌కు కావాల్సిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు దాదాపు 85 శాతం రష్యా నుంచే వస్తున్నాయని వాషింగ్టన్ థింక్ ట్యాంక్ స్టిమ్సన్ సెంటర్ పేర్కొంది. రష్యా ఆయుధాలు భారత్‌కు అందుబాటులో ఉండటంతో అమెరికా, ఇతర దేశాల ఆంక్షలు భారత్ పై బలంగా ప్రభావితం చేయలేవు. ఇటీవలే భారత్ ఆయుధ కొనుగోళ్లలో కొంత వైవిధ్యాన్ని అనుసరిస్తున్నది. అయినా.. రష్యాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెరర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ప్రకారం 2018 నుంచి 2022 మధ్య రష్యా నుంచి భారత్‌కు 45 శాతం దిగుమతి అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి 29 శాతం, ఆ తర్వాత అమెరికా నుంచి 11 శాతం దిగుమతి అయ్యాయి.
2013 - 2017 నుంచి 2018 - 2022ల మధ్య భారత ఆయుధ దిగుమతులు 11 శాతం తగ్గిపోయాయనీ ఆ రిపోర్టు పేర్కొంది. దీనికి రెండు కారణాలు, ఒకటి భారత్ దేశీయంగా ఉత్పత్తులు మొదలు పెట్టడం, రెండు ఉక్రెయిన్ యుద్ధం. దిగుమతులు తగ్గినా ప్రపంచంలో అత్యధిక ఆయుధ దిగుమతిదారుల్లో భారత్ కూడా ఉన్నది.
ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా, భారత్‌ల మధ్య ఆయుధ ఒప్పందాల్లో అవాంతరాలు వచ్చాయి. ఇప్పటికే భారత్‌కు చేరాల్సిన రెండు వార్ షిప్‌లు మన దేశం చేరడానికి కనీసం మరో ఆరు నెలల కాలం పడుతుందని అంచనా. తాజా రిపోర్టుల ప్రకారం మిగిలిన రెండు ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌లు మరింత ఆలస్యం అవుతాయి. ఈ ఆలస్యానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉన్నది.
రష్యా నుంచి ఆయుధ దిగుమతి ఆలస్యం కావడం భారత్‌కు ఆందోళనగా తెచ్చిపెడుతున్నది. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా భారత్, రష్యాల మధ్య ఆర్థిక లావాదేవీలు జఠిలంగా మారాయి. ఈ ఆంక్షల కారణంగా రష్యా డాలర్లను పొందడం క్లిష్టమైంది. తత్ఫలితంగానే రష్యా, భారత్‌లు వాటి కరెన్సీలు రూబుల్, రూపాయిలతోనే వాణిజ్యం చేసేలా పరిస్థితులు పరిణమించాయి. కానీ, దీనికి సంబంధించి కూడా స్పష్టమైన అగ్రిమెంట్ కనుచూపు మేరలో కనిపించడం లేదు.
ఈ పేమెంట్ సమస్యలు రష్యాకు కష్టంగా మారిందని, భారత దిగుమతి బిల్లులు పెరుగుతున్నాయి. కానీ, దానికి పరిష్కారం దొరకడం లేదు.
రష్యాకు మన ప్రత్యర్థి చైనా సన్నిహితం కావడం:
రష్యా, చైనాల మధ్య స్నేహం ఊహించని రీతిలో బలపడటం భారత్‌కు సమస్యగా మారుతున్నది. వారి మధ్య సంబంధాలకు హద్దే లేదని ఆ దేశాలు ప్రకటించుకున్నాయి. లడాఖ్ సరిహద్దులో ఇప్పటికీ భారత్, చైనా ట్రూపుల మధ్య మూడేళ్ల నుంచి ఇంకా ఘర్షణపూరిత వాతావరణమే ఉన్నది.
రష్యా, చైనాల మధ్య బంధం బలోపేతం కావడం కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రష్యా అత్యంత అధునాతన ఆయుధాలను చైనాకు పంపిస్తున్నది. వీటితో డీల్ చేసే భారత సామర్థ్యంపై దీని ప్రభావం నేరుగా పడుతున్నది.
రష్యాకు చైనా ప్రధానమైన భాగస్వామిగా మారిందనే విషయం భారత్‌కు అర్థమైంది. ఒకప్పటి రష్యా, ఇప్పటి రష్యా ఒకటి కాదనే నిర్దారణకు వచ్చింది.
Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి
ఈ పరిస్థితుల కారణంగా భారత్ అమెరికాతో రక్షణ ఒప్పందాలు పెంచుకోవడం, ఆ దేశంతో బంధాన్ని, భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి సానుకూలంగా ఉన్నదని రాజగోపాలన్ తెలిపారు.
అయితే, కొందరు మాత్రం రష్యా నుంచి భారత్ దూరంగా జరగడం అంత సులభమేమీ కాదని అంటున్నారు. దక్షిణాసియాలో అమెరికా లక్ష్యాలు కూడా భారత్‌కు కొంత ఇబ్బందికరమే.
భారత్‌తోనూ అమెరికాకు ఒక అనిశ్చిత సమస్య ఉన్నదని రష్యాకు భారత అంబాసిడర్‌గా చేసిన ప్రభాత్ శుక్లా తెలిపారు. కష్ట సమయాల్లో భారత్‌తో ఏ వైఖరితో ఉండాలన్ని నిశ్చిత నిర్ణయాలు అమెరికాకు లేవని చెప్పారు. చైనాను కట్టడి చేసేంత బలంగా భారత్ ఉండాలని అమెరికా కోరుకుంటుందని, కానీ, అదే సమయంలో అది పాకిస్తాన్‌కూ ముప్పుగా మారవద్దనీ కోరుకుంటుందని వివరించారు.
రష్యా నుంచి భారత్ దూరంగా జరగడం ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని రాజన్ కుమార్ తెలిపారు. ఎందుకంటే భారత్ వద్ద సుఖోయ్ జెట్‌లు చాలా పుష్కలంగా ఉన్నాయని, వీటి స్థానంలో ఎఫ్-16లు వచ్చి చేరాలంటే చాలా సమయం పడుతుందని వివరించారు. భారత్ దిగుమతుల్లో వైవిధ్యాన్ని పాటించినా రష్యాకు దూరంగా జరగాలంటే కనీసం ఐదు నుంచి పదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.